ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రుల్లో అందని ఆరోగ్య శ్రీ సేవలు - చిత్తూరులో ప్రైవేట్ ఆసుపత్రులు

కరోనా ఓ వైపు బెంబేలెత్తిస్తుంటే..సామాన్యప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులు పరుగులు తీయిస్తున్నాయి. కోవిడ్​ చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే.. ఆరోగ్య శ్రీ సేవలను వారికి అందించడంలేదు. వారికి పడకలు ఖాళీ లేవని చెబుతూ ..వెనక్కి పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సెప్టెంబరు 5 నాటికి 44,465 కేసులు నమోదు కాగా..వారిలో 3,425 మందికి మాత్రమే ఆరోగ్య శ్రీ సదుపాయం కల్పించారు.మిగతా కోవిడ్ బాధితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

private hospitals  are not providing    arogyasree scheame in  chittore district
ప్రైవేటు ఆస్పత్రుల్లో అందని ఆరోగ్య శ్రీ సేవలు

By

Published : Sep 12, 2020, 12:32 PM IST

తిరుపతి నగరానికి చెందిన ఓ వ్యక్తికి వారం రోజుల క్రితం కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణయింది. మధ్యస్థంగా లక్షణాలు ఉండటంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రి(ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌)లో ఉచితంగా చికిత్స పొందుదామని భావించారు. బాధితుడి కుటుంబసభ్యులు ముందుగానే సిబ్బందితో మాట్లాడటానికి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడున్న ఉద్యోగి రోగి ఆరోగ్య పరిస్థితితోపాటు ఆయనతోపాటు పిల్లలు ఏం చేస్తుంటారనే వివరాలను ఆరా తీశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న కుటుంబసభ్యులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని.. ఉచితంగా వైద్యం పొందడానికి వచ్చామని చెప్పడంతో పడకలు ఖాళీ లేవని సమాధానమిచ్చారు.

జిల్లాలోని ఓ ఉన్నతాధికారికి ఐదు రోజుల కిందట కరోనా సోకడంతో మెరుగైన వైద్యం లభిస్తుందని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు రోజుకు రూ.30వేలు చెల్లించాలని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. 10 రోజులు ఆసుపత్రిలో ఉన్నా.. రూ.3 లక్షలు చెల్లించాలని ఉద్యోగులు పేర్కొన్నారు. ఉన్నతాధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు చర్చించుకున్నారు.

కొవిడ్‌తో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే ఆర్థికంగా చితికి పోవాల్సిందే. ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేసుకుందామంటే పడకలు ఖాళీ లేవనే సమాధానం. ఇదీ తిరుపతిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న తంతు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రైవేటు వైద్యశాలలకు కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకునేవారి నుంచి రూ.1,900 తీసుకోవాలని ఆగస్టు 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనను బేఖాతరు చేస్తూ.. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలకు రూ.3వేలు- రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. తిరుపతి, మదనపల్లెలో ప్రధానంగా ఈ సమస్య ఉంది.

ఆర్థిక పరిస్థితి వాకబు చేసిన తర్వాతే..

జిల్లాలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని.. మొత్తం ఖర్చును ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుందని జులై 8న ప్రభుత్వం పేర్కొంది. నెట్‌వర్క్‌ పరిధిలో లేనిచోట్ల చేరితే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే తీసుకోవాలని, ఆ వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రకటించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని కొన్ని చిన్న వైద్యశాలల్లో రోజుకు రూ.15వేలు- రూ.20వేలు, కొన్ని కార్పొరేట్‌లో రోజుకు రూ.20వేలు- రూ.30వేలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రుల్లో ముందుగానే బాధితుడి ఆర్థిక పరిస్థితిని వాకబు చేయడానికి ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తున్న పరిస్థితి నెలకొంది. వారు రోగి ఆర్థికంగా స్థితిమంతుడని నిర్ధారించుకున్న తర్వాతే పడకలు అందుబాటులో ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు ఫీజులు నిర్దేశించింది కదా? ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారని బాధితుడి బంధువులు ప్రశ్నిస్తే వైద్యులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని.. పీపీఈ కిట్లు, మందులకు ఎక్కువ ఖర్చవుతోందని జవాబిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులను చేర్చుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటులో తక్కువే

ఆరోగ్య శ్రీ కింద కొవిడ్‌ చికిత్స చేయించుకున్నవారు సెప్టెంబరు 5 నాటికి 3,425 మంది ఉన్నారు. వీరిలో 80 శాతం బాధితులు మంది రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందిన వారే. ఒక్క రుయాలోనే 1750 మంది బాధితులు ఆరోగ్య శ్రీ కింద చేరారు. దీన్నిబట్టి ప్రైవేటు వైద్యశాలల్లో ఆరోగ్య శ్రీ సేవలు ఏ మేరకు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

నోటీసులు జారీ చేస్తాం

జిల్లాలో కొవిడ్‌ చికిత్సకు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న రెండు ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. మరికొన్ని వైద్యశాలలపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి కూడా నోటీసులు జారీ చేసి.. వారు ఇచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకుంటాం. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే బాధితులు మా దృష్టికి తీసుకురావచ్ఛు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు కరోనా రోగులు వస్తే తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ విషయమై ఆరోగ్య శ్రీ అధికారులతో మాట్లాడతాం.

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో

ఇదీ చూడండి.మెప్మా బజార్లపై కరోనా ప్రభావం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details