ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లు చెల్లించని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విద్యుత్​ సరఫరా నిలిపివేత - తిరుపతి బాలాజీ రిజిస్ట్రేషన్ కార్యాలయం

ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే గంటల తరబడి వేచి ఉండాల్సి రావటం షరామూమూలే. ఇటీవలి కాలంలో సర్వర్ డౌన్ సమస్యలతో రాష్ట్రమంతటా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ సమస్యలు ఇలా ఉంటే పాత బకాయిలు చెల్లించటం లేదని ఏకంగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సరఫరా నిలిపేశారు విద్యుత్ శాఖ అధికారులు. దీంతో తిరుపతిలోని బాలాజీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం రోజంతా అంధకారంలో చిక్కుకుని.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

power supply disconnected to tirupathi balaji registration office
విద్యుత్ బిల్లులు కట్టని రిజిస్ట్రేషన్ శాఖ.. కార్యాలయానికి సరఫరా నిలిపివేత

By

Published : Aug 29, 2020, 5:50 PM IST

తిరుపతి నగరానికి సంబధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా.. నగరంలోని బాలాజీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతుంటుంది. రోజుకు రద్దీని బట్టి 25-30 రిజిస్ట్రేషన్లు ఈ కార్యాలయంలో నిర్వహిస్తారు. దీంతోపాటు వందల సంఖ్యలో ఇతర రిజిస్ట్రేషన్ సంబంధిత అవసరాల కోసం ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. రోజూ ఇక్కడ నిర్వహించే రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 40 నుంచి రూ. 50 లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది.

రూ. 2 లక్షల వరకు బకాయిలు

ఇంతటి ఆదాయాన్ని అందించే కార్యాలయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో లక్షల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. 4 నెలలకు సంబంధించి సుమారు రూ. 2 లక్షల బిల్లులు కట్టకపోవటంతో విద్యుత్ శాఖ అధికారులు చాలాసార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు స్పందించకపోవటంతో శుక్రవారం సాయంత్రం నుంచి కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అక్కడ అంధకారం అలుముకుంది.

నిలిచిన రిజిస్ట్రేషన్లు

విద్యుత్ సరఫరా లేక కంప్యూటర్లు ఆగిపోయి.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. బ్యాటరీ బ్యాకప్, యూపీఎస్ గంటల తరబడి వచ్చే సౌకర్యం లేక శనివారం ఉదయం నుంచి పనులన్నీ ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వచ్చిన వారంతా గంటల తరబడి వేచి చూసి తిరిగి వెళ్లిపోయారు. కరోనా ప్రబలుతున్న క్రమంలో ఇలా 2, 3 సార్లు కార్యాలయానికి వచ్చి వెనుదిరగాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

బడ్జెట్ తక్కువగా ఉన్నందువల్లే

రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి తమ కార్యాలయానికి వచ్చే బడ్జెట్ అరకొరగా ఉన్నందున విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయని స్థానిక రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. నెలకు రూ. 15 నుంచి రూ. 20వేల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారని.. పాత నెలల బకాయిలు, వాటికి అదనపు సర్ ఛార్జీలు పెరిగిపోయి.. పెద్దమొత్తంలో బకాయిలు పడ్డామని చెబుతున్నారు. 4 నెలలుగా పలు దఫాలుగా విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇస్తున్నారని.. ఈ విషయం పై అధికారులకు తెలిపినా ఫలితం లేదన్నారు. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారని తెలిపారు

శాఖల మధ్య సమన్వయలోపం, అధికారుల నిర్లక్ష్యంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రిజిస్ట్రేషన్ ఆఫీసులకి వచ్చే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి..

వరదొస్తే కష్టం... ప్రమాదంతోనే ప్రయాణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details