ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరరాజకు విద్యుత్ సరఫరా నిలిపివేత​.. ఎందుకంటే? - అమరరాజకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఏపీఎస్​పీడీసీఎల్ న్యూస్

చిత్తూరు జిల్లాలోని అమరరాజా పరిశ్రమలకు.. ఏపీఎస్​పీడీసీఎల్​ సంస్థ విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. సరఫరా ఆగిపోవడంతో..ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారంటూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.. పరిశ్రమను మూసివేయాలంటూ ఇప్పటికే.. సంస్థకు క్లోజర్‌ నోటీసు ఇచ్చింది. అదే సమయంలో విద్యుత్‌ సరఫరాను ఆపివేయడంతో..సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అమరరాజకు విద్యుత్ సరఫరా నిలిపివేత​.. ఎందుకంటే?
అమరరాజకు విద్యుత్ సరఫరా నిలిపివేత​.. ఎందుకంటే?

By

Published : May 2, 2021, 4:42 AM IST

Updated : May 2, 2021, 4:48 AM IST

తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమలో, పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారంటూ.. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్‌ నోటీసు ఇచ్చింది. జిల్లాలోని నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న యూనిట్లు పర్యావరణ అనుమతులు, ఆపరేషన్‌ నిర్వహణ సమ్మతి విధించిన షరతులు ఉల్లంఘించినందున వాటి మూసివేతకు ఆదేశాలు జారీచేసినట్లు ఏపీ పీసీబీ వెల్లడించింది.

నోటీసులు అందాక ఆయా ప్లాంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తే.. నీటి కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 41, వాయుకాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 37-1 ప్రకారం కనీసం ఏడాదిన్నర నుంచి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే క్రమంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలంటూ ఏపీఎస్​పీడీసీఎల్​కు పీసీబీ ఆదేశాలిచ్చింది. దీంతో శనివారం నుంచి ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిణామంతో సంస్థ పరిధిలోని వివిధ విభాగాల్లో.. ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50 వేలమందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

5 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాం
నోటీసులపై చట్టపరంగా ముందుకెళ్తామని అమరరాజా యాజమాన్యం స్పష్టం చేసింది. ‘ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్‌ సంస్థగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం సహా అన్ని విషయాల్లో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నామని...’ వెల్లడించింది. భాగస్వాముల ప్రయోజనాల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ, విదేశాల్లో అతి కీలక రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలకు సంస్థ ఉత్పత్తులను అందజేస్తూ గత 35 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించినట్లు వివరించింది.

ఇదీ చదవండి:నేడే తిరుపతి ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ఏజెంట్స్​కి పీపీఈ కిట్ తప్పనిసరి

Last Updated : May 2, 2021, 4:48 AM IST

ABOUT THE AUTHOR

...view details