Poultry Giant Sundaranaidu Jayanthi Sabha: పౌల్ట్రీ, సమాజ సేవ డాక్టర్ సుందరనాయుడికి రెండు కళ్లని పౌల్ట్రీ రైతులు కొనియాడారు. రాయలసీమలో కోళ్ల పరిశ్రమ ప్రగతికి ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని నెక్ జోనల్ కార్యాలయంలో చిత్తూరు పౌల్ట్రీ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ సమాఖ్య, నెక్ ఆధ్వర్యంలో శనివారం పౌల్ట్రీ దిగ్గజం సుందరనాయుడి 87వ జయంతి నిర్వహించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కుమార్తె, బాలాజీ హేచరీస్ ఎండీ నీరజ, బాలాజీ హేచరీస్ డైరెక్టర్ ప్రణీత్, నెక్ జోనల్ ఛైర్మన్ రమేష్‌బాబు, కోళ్ల రైతులు పాల్గొన్నారు.
పౌల్ట్రీ రంగానికి సుందరనాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. చిత్తూరు నగరాభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించారన్నారు. కోళ్ల పరిశ్రమ ఉన్నంత కాలం సుందరనాయుడి జయంతి, వర్ధంతి నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. రాయలసీమలో వరుసగా కరవు కాటకాలతో అన్నదాతలు నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో పౌల్ట్రీ ద్వారా సుందరనాయుడు రైతులకు చేయూతను అందించారని ప్రణీత్ తెలిపారు. పశు వైద్యుడిగా పని చేసిన సమయంలో గ్రామాలకు వెళ్లి వైద్యం అందించారని చెప్పారు.
అన్నదాతల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు తాను కోళ్ల ఫారం నెలకొల్పడంతోపాటు లక్షల మందిని ఆ రంగం వైపు మళ్లించారని తెలిపారు. ఆయన కారణంగా ఎంతోమంది కర్షకుల పిల్లలు ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. నెక్ జోనల్ ఛైర్మన్, రెడ్‌క్రాస్ గౌరవ ఛైర్మన్ రమేష్‌బాబు మాట్లాడుతూ.. సుందరనాయుడి జ్ఞాపకార్థం పౌల్ట్రీ రైతుల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మిస్తామన్నారు. అందులో వ్యాధుల నిర్ధారణ, కోళ్ల మేత, ఔషధాల నాణ్యత పరిశోధనశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూగ జీవాలంటే సుందరనాయుడికి ఎనలేని ప్రేమని నెక్ జోనల్ మాజీ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగానికి కష్టాలు వచ్చిన ప్రతిసారీ ఆయన పెద్దదిక్కుగా వ్యవహరించి వాటినుంచి రైతులను గట్టెక్కించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈశ్వరరావు, సి.జగదీష్, జానకిరామ్, తుకారాం, బాలాజీ హేచరీస్ మేనేజర్ రాజేంద్ర, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.