రెండు బల్బులు, ఫ్యాన్ తప్ప మరేమీ లేని పూరింటికి.. వేల రూపాయల్లో విద్యుత్ బిల్లులు రావడంపై బాధితులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో వందల రూపాయల్లోనే బిల్లులు చెల్లించిన వీరికి ఈ నెలలో షాక్ కొట్టేలా బిల్లులు జారీ అయ్యాయి.
మార్చి నెలలో విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులు ఏప్రిల్ లో వచ్చిన విద్యుత్ ఛార్జీలను చూసి లబోదిబో మంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మార్చి నెలలో విద్యుత్ బిల్లులు రీడింగ్ తీయని ట్రాన్స్‌కో అధికారులు... మార్చి, ఏప్రిల్ నెలల రీడింగ్ ఒకేసారి తీశారు. రెండు నెలలకు వేర్వేరుగా లెక్కకట్టి శ్లాబ్‌లు కేటాయించి బిల్లులు వసూలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇస్తున్నా, వినియోగదారుల్లో మాత్రం అనుమానాలు నెలకొన్నాయి.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఓ గ్రామంలో పూరిగుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబానికి 17 వేల రూపాయలు బిల్లు వచ్చింది. ఇదే తరహాలో శ్రీ కాళహస్తి శివారులోని మరో కాలనీలో 28 వేల రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇంటిపట్టున ఉంటున్న సమయంలో వేల రూపాయల బిల్లులు వస్తే ఎలా చెల్లించగలమంటూ ప్రశ్నిస్తున్నారు.