తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడిని(ramanaidu) చిత్తూరు జిల్లా కుప్పంలో(kuppam) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో.. నిమ్మల ఒక హోటల్‌లో బసచేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో హోటల్ కు వెళ్లారు. అర్ధరాత్రి వేళ పోలీసులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మల రామానాయుడు.. గదికి తాళం వేసుకుని లోపలే ఉండిపోయారు. అయితే.. అక్కడే ఉన్న పోలీసులు.. అర్ధరాత్రి 1.30 సమయంలో ఎమ్మెల్యే తలుపు తీయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించటంతో తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కుప్పం పురపాలిక కార్యాలయం వద్ద ఇటీవల నిరసనకు దిగారు. కుప్పం మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చొక్కా చిరిగింది. దీంతో ఆగ్రహించిన తెదేపా శ్రేణులు.. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.