చిత్తూరు జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 18.06 శాతం మేర నేరాలు తగ్గాయని ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు. వార్షిక నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. 'గతేడాది 1,424 కేసులు నమోదైతే ఈ ఏడాది 1,238 నమోదయ్యాయి. టెక్నికల్ అనాలసిస్ వింగ్ ద్వారా సెల్ దొంగలను, నగరిలో దారి దోపిడీకి పాల్పడిన కంజరభట్ ముఠాను మధ్యప్రదేలో అరెస్టు చేసి రూ.8 కోట్ల విలువైన చరవాణులు రికవరీ చేశాం. చోరీ కేసుల్లో రూ.12.75 కోట్లకు గాను రూ.9.89 కోట్లు రికవరీ చేశాం. ఎస్సీ, ఎస్టీ కేసులు ఏడాది తగ్గాయి. అన్ని కేసుల్లో 85.24 శాతం మందికి శిక్ష పడింది. గతేడాది 539 ప్రమాదాలు జరిగితే... ఈ ఏడాది 448 జరిగాయి. ఎస్ఈబీ వివిధ అక్రమాలపై 3,495 కేసులు పెట్టింది' అని ఎస్పీ వెల్లడించారు.
- ప్రతి ఒక్కరి రక్షణ పోలీసు బాధ్యతని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది(2020) నేరాలు, కేసుల వివరాలను బుధవారం రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు.
స్పందనద్వారా వచ్చిన 245 ఫిర్యాదులకు గాను 203 పరిష్కరించారు. వీటిలో మహిళలకు సంబంధించిన 132 ఫిర్యాదులకు గాను 44 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. డయిల్ 100: 345 కేసులకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఎస్పీ వాట్సప్ హెల్ప్‌లైన్: 131 ఫిర్యాదులు రాగా 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు. ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలు: 34,970 ఇంటి యజమానులు నమోదు చేసుకోగా వారిలో 1,616 మంది ఉపయోగించుకున్నారు. కేసుల ఛేదనలో గత అక్టోబరులోని ప్రకాశంనగర్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దోపిడీ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. జూన్‌లో కడియం మండలంలో ఓ దారిదోపిడీ కేసుకు సంబంధించి రూ.5.70 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ తెలిపారు.
- అనంతపురం జిల్లావ్యాప్తంగా పోలీసులు ఈ ఏడాది చక్కగా పనిచేశారని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు చెప్పారు. 2020లో పోలీసు శాఖ పనితీరు, నేర గణాంకాల వార్షిక నివేదికను ఆయన బుధవారం విడుదల చేశారు. 'జాతీయ స్థాయిలో 8, రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు వచ్చాయి. కోర్టుల ద్వారా వివిధ కేసుల్లో నిందితులకు 5049 శిక్షలు పడేలా మా శాఖ పనితీరు కనబర్చింది. జిల్లాలో మోసం కేసులు మూడు శాతం పెరిగాయి. నకిలీ ధ్రువపత్రాల తయారీ ముఠాను అరెస్టు చేసి పీడీ చట్టం అమలు చేసి కేసులు నమోదు చేశాం. నేరస్థుల సంఖ్యను తగ్గించగలిగామ'ని సత్య ఏసుబాబు చెప్పారు.
- 2019 సంవత్సరంలో కన్నా ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో 2020లో పోలీసుల పనితీరు, నేర గణాంకాల వార్షిక నివేదికను ఆయన బుధవారం వెల్లడించారు. అత్యాచారాలు, హత్యలు, చోరీలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఎక్సైజ్ కేసులు గత ఏడాది 58 కాగా, ఈ సారి 3184 కేసులు నమోదయ్యాయి.