CASE FILE ON NARA LOKESH AND TDP LEADERS : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో.. యువగళం పాదయాత్ర సందర్భంగా.. శుక్రవారం చోటు చేసుకున్న ఘటనలపై.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. లోకేశ్‌తో పాటు అమర్నాథ్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, పులివర్తి నానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలు జయప్రకాశ్, జగదీష్‌పై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
లోకేశ్ సహా పలువురిపై.. బంగారుపాళ్యం ఎస్సై మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర నేతలపై పలమనేరు సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు వారిపై.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించారంటూ.. శుక్రవారం నాడు.. బంగారుపాళ్యంలో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
బహిరంగసభ జరగకుండా పాదయాత్ర వాహనాలను సీజ్ చేశారు. అయితే లోకేశ్ పక్కనే ఉన్న డాబా ఎక్కి ప్రజలతో మాట్లాడారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు .. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. కార్యకర్తలపై 353, 290,188, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..