Chandrababu visit to Kuppam: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాలపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు.
తెదేపా నేతలు బాబు పర్యటించే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు ముందుగానే చేరింది. పర్యటనకు అనుమతి తీసుకోవాలని నేడు పలమనేరు పోలీసుల నుంచి కుప్పం తెదేపా నేతలకు నోటీసులు జారీచేశారు. రాష్ట్రం ప్రభుత్వం నిన్న తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి ఉన్న చోటనే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని పలమనేరు డీఎస్పీ నోటీసులో స్పష్టం చేశారు.