చిత్తూరు నగరంలోని బీవీ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పారిశ్రామిక వేత్త బద్రీ నారాయణ నివాసంలో గత నెల 28 వ తేదీ జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విశాఖకు చెందిన కర్రి సతీష్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.04 కోట్ల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు, రూ.10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, రూ.90వేల నగదు, ఒక బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.
భారీ చోరీ కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు - Chittor District news
వారు దొంగతనాలు చేయటంలో దిట్ట. కన్నంవేశారంటే...కనిపెట్టడం అంత సులభం కాదు. ఆంధ్ర, తెలంగాణల్లో వీరిపై చాలా కేసులున్నాయి. ఇటీవలే చిత్తూరు నగరంలోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ చేశారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిందితుడు కర్రి సతీష్ రెడ్డిపై తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రలో 70 వరకు చోరీ కేసులు ఉన్నట్లు చెప్పారు. మరో నిందితుడు నరేంద్ర పై ఇదే ప్రాంతాల్లో 28 చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. గత నెల 28 వ తేదీ బద్రీ నారాయణ నివాసంలో జరిగిన చోరీకి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. చోరీ కేసును ఛేదించిన సీసీఎస్ సీఐ రమేష్, రెండో పట్టణ సీఐ యుగంధర్, ఇతర సిబ్బందిని ఎస్పీ సెంథిల్ కుమార్ అభినందించారు.