ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పంలో సీఎం పర్యటన.. పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసిన పోలీసులు

KUPPAM TENSION : తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణంలో నేడు ముఖ్యమంత్రి జగన్​ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మంది వరకు పోలీసు సిబ్బంది అడుగడుగునా మోహరించారు. మరోవైపు హెలిప్యాడ్‌ నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డును మధ్యలో తవ్వి బారికేడ్లు ఏర్పాట్లు చేయడంతో పట్టణంలో రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డారు.

KUPPAM TENSION
KUPPAM TENSION

By

Published : Sep 23, 2022, 7:31 AM IST

TENSION AT KUPPAM : ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి శుక్రవారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మంది వరకు పోలీసు సిబ్బంది పట్టణంలో అడుగడుగునా మోహరించారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ కోసం గురువారం కొద్దిసేపు కుప్పం చెరువు కట్ట వద్ద వాహనాలు నిలిపేయడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. పట్టణ సమీపంలోని హెలిప్యాడ్‌ నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డును మధ్యలో తవ్వి బారికేడ్లు ఏర్పాట్లు చేయడంతో పట్టణంలో రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు దుకాణాలకు వెళ్లేందుకు దారి లేక రెండు రోజులుగా వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారులు వాపోతున్నారు.

జగన్‌ వెళ్లాక రోడ్డు మధ్యలో ఉన్న గుంతలను ఎవరు పూడ్చుతారోననే చర్చ పట్టణంలో సాగుతోంది. హెలిప్యాడ్‌ నుంచి సుమారు నాలుగు కి.మీ.మేర బ్యానర్లు, ప్లెక్ల్సీలను వైకాపా శ్రేణులు ఏర్పాటు చేశాయి. సీఎం సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులు ఇవ్వాలంటూ ఆ పార్టీ నాయకులు ముందుగానే మాట్లాడుకున్నారు. గురు, శుక్రవారాలు కుప్పం మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

YSR చేయూత పథకం:45 నుంచి 60ఏళ్లు మధ్య వయస్సు గల పేద మహిళలకు.. 18 వేల 750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే ఈ కార్యక్రమంలో.. సీఎం జగన్ బటన్‌ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. అర్హులైన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఖాతాల్లోనే నగదు జమ కానుంది. మొత్తం 26 లక్షల 39 వేల703 మంది మహిళలకు 4వేల 949.44 కోట్లను.. జగన్ విడుదల చేయనున్నారు.

దుకాణాల మూసివేతకు హెచ్చరికతో కూడిన సూచన

కుప్పం పట్టణంలోని అనిమిగానిపల్లె సమీపంలో వైఎస్‌ఆర్‌ చేయూత ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించనున్నారు. కుప్పం చెరువు కట్టనుంచి బస్టాండ్‌, కృష్ణగిరి బైపాస్‌ మీదుగా అనిమిగానిపల్లె వరకు సీఎం కాన్వాయ్‌ వెళ్లనుంది. ఈ రహదారి వెంట ఉన్న దుకాణదారుల, ఇళ్ల వివరాలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సాయంతో పోలీసులు సేకరించారు. వారి పేర్లు, ఫోన్‌నెంబర్లు, దుకాణంలో ఎవరెవరు ఉంటారని తెలుసుకున్నారు. మీ ఇళ్లపై నుంచి కాన్వాయ్‌పై ఏమైనా పడితే మీరే బాధ్యత వహించాలని చెప్పారు. కొందరు సిబ్బంది ఓ అడుగు ముందుకేసి దుకాణాలు మూసేస్తే మీకే మంచిదంటూ హెచ్చరికతో కూడిన సూచనలిచ్చారు. దీంతో శుక్రవారం తాము దుకాణాలే తెరవమంటూ వారు సమాధానమిచ్చారు.

ముఖ్యమంత్రే రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కోరుతున్నా, ఆయన రాక నేపథ్యంలో జగన్‌ ఫొటోలతో కుప్పంలో భారీగా వెలిశాయి. రోడ్డు వెంట ఉన్న చెట్లకు సైతం వైకాపా రంగులద్దారు.

తెదేపా నాయకుల గృహ నిర్బంధం

ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన సందర్భంగా ఆ నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలను.. వివిధ మండలాల్లో తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్‌ చేశారు. తెలుగుదేశం శ్రేణులు శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని.. పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిపురం, కుప్పం, గుడిపల్లె మండలాలకు చెందిన తెలుగుదేశం నాయకులు జిల్లాలో 190 కిలోమీటర్ల దూరములోని విజయపురం, నిండ్ర, కార్వేటి నగరం మండలాల తహసీల్దార్‌ల ఎదుట హాజరయ్యారు. దీనికితోడు నియోజకవర్గంలో క్రియాశీలంగా ఉన్న తెదేపా కార్యకర్తలను గురువారం ఉదయం నుంచే గృహనిర్బంధంలో ఉంచారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details