తిరుపతి గోవిందరాజస్వామి గుడి చోరీ కేసు ఛేదన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో హూండీ చోరీ యత్నం కేసును పోలీసులు చేధించినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. గోవిందరాజస్వామివారి ఆలయంలో చోటు చేసుకున్న చోరీ యత్నం ఘటనపై విజిలెన్స్ అధికారులకు తితిదే ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
జువైనల్ హోంకు తరలింపు...
ఫిర్యాదు మేరకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు. గోవిందరాజస్వామివారి కోనేరు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించగా... తానే ఆ చోరీ యత్నం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోమ్ కు తరలించిన్నట్లు వివరించారు.
తండ్రి మందలించాడని తిరుపతికి రాక..
తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాకు చెందిన మైనర్ బాలుడు తన తండ్రి మందలించడంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుపతికి వచ్చిన బాలుడు ఆరు రోజులుగా స్థానికంగా ఉంటూ ఆలయాల్లోని ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటూ నగరంలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ధ్వజస్తంభాల వద్ద భక్తులు వేసే చిల్లర నాణేల కోసం శుక్రవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని పరకామణి వద్ద దాక్కున్నాడు.
రాత్రంతా హుండీ చోరీకి యత్నం...
ఆ రాత్రంతా హూండీ చోరీ యత్నానికి పాల్పడ్డాడు. దొంగతనం విఫలం కావడంతో.. ఉదయాన్నే భక్తుల్లో కలిసిపోయి అక్కడి నుంచి పరారయ్యాడా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా... నేరం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.
ఇదీచదవండి