కూరలో పురుగుల మందు గుళికలు.. అవ్వ పెట్టిన బువ్వే ఆఖరిదైంది - చిత్తూరులో మసాలా బదులు పురుగుల మందు గుళికలు న్యూస్
![కూరలో పురుగుల మందు గుళికలు.. అవ్వ పెట్టిన బువ్వే ఆఖరిదైంది pesticide pellets in curry instead of masala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7725893-656-7725893-1592834893465.jpg)
18:42 June 22
విషాదానిది ఒక్కోసారి ఒక్కోరూపు. ఎటునుంచి ఎలా వస్తుందో తెలియదు. పాపం ఓ వృద్ధురాలి ఇంట్లో అలాగే జరిగింది. తన మనవళ్లకు ప్రేమతో కడుపు నిండా అన్నం పెట్టాలనుంది. అదే వారికి చివరి ముద్ద అవుతుందని ఊహించలేదు. ఆ బువ్వ తిని ఇద్దరి చిన్నారుల ప్రాణాలు పోయాయి.
మా అవ్వ బంగారం... మా అవ్వ దగ్గరకు వెళితే అడిగింది చేసి పెడుతుంది.. అస్సలు కాదనదు అనుకుని మనవళ్లు అవ్వ ఇంటికి వెళ్లారు. అనుకున్నట్లుగానే వృద్ధురాలు తన మనవళ్లకు ఇష్టమైనవి చేసి పెడుతూ.. కొసరి.. కొసరి తినిపించాలనుంది. కానీ అదే ఆ ఇంట విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఎ.ఎల్.పురం బీసీ కాలనీలో ఓ వృద్ధురాలు తన మనవళ్ల కోసం కూర వండింది. కళ్లు కనిపించకనో.. ఇంకేదో కారణమో తెలియదు.. గరం మసాలా అనుకుని కూరలో పురుగుల మందు గుళికలు వేసింది. ఆహారం తిని వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆహారం తిని వృద్ధురాలి ఇద్దరు మనవళ్లు రోహిత్(11), జీవన్(8) మృతి చెందారు.