Dharna for Roads: తమ గ్రామాలకు రోడ్డు వేయాలంటూ పెద్ద పంజాని మండలం చెలమంగలం పంచాయతీ గ్రామస్థులు రోడ్డెక్కారు. సుమారు 6 గ్రామాలకు చెందిన ప్రజలు తమ రోడ్ల దుస్థితి మార్చాలంటూ బ్యానర్ పట్టుకుని మండల కేంద్రమైన పెద్ద పంజానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ చెలమంగలం పంచాయతీలోని తమ గ్రామాలకు దశాబ్దాల నుండి రోడ్లు లేవని.. వర్షాలు పడితే తమ గ్రామాలకు పాల ఆటోలు సైతం రావని, పిల్లలు స్కూలుకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది పాలకులు, నాయకులకు మొర పెట్టుకున్నా సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ఎంపీడీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ రెండున్నర కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరైందని, అతి త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
"మా భవిష్యత్తు మారాలంటే మాకు రోడ్లు కావాలి. మేము స్కూల్కు వెళ్లాలంటే కష్టంగా ఉంది. దయచేసి మీరు మాకు రోడ్లు వేపించండి". - స్కూల్ పిల్లలు