రంకెలు వేస్తూ ఉరకలెత్తిన పశువుల పౌరుషం ముందు యువత సాహసం చిన్నబోయింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పశువుల పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సాధారణంగా ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ పండగ.. వెదురుకుప్పం మండలం కొండకిందపల్లిలో పోలీసుల ఆంక్షలతో వాయిదా వేశారు. పశువుల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమని గ్రామస్తులు పండుగ ముగిసిన తర్వాత జల్లికట్టును నిర్వహించారు.
కొండకిందపల్లిలో పశువుల పండగ విషయమై.. ముందస్తుగా జరిగిన ప్రచారంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. సమీప ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు దీటుగా ఇతర ప్రాంతాల నుంచి పశువుల పండగలో పాల్గొనేందుకు పశువులను తరలించారు. పట్టెడలతో గ్రామస్తులు ముస్తాబు చేసిన కోడె గిత్తలను, ఎద్దులను విడతలవారీగా జన సమూహంలోకి వదిలిపెట్టారు.