ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారీ కోసం తిరిగే వాహనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు.. రక్షించాలంటూ వేడుకోలు

క్వారీ కోసం తిరిగే హెవీ ట్రక్కుల వల్ల గొల్లపల్లి నుంచి మాదిగ బండకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా తయారైంది. దీంతో చుట్టుపక్కల నివసించే పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇంబందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 5 కిలోమీటర్లు మేర రోడ్డు ధ్వంసం అవ్వటం వల్ల ప్రజలకు ఆ రహదారిపై ప్రయాణం సాహస యాత్రగా మారింది. దీంతోపాటు లారీల వెనుక వచ్చే దుమ్ము, ధూళి కారణంగా పంటలకు నష్టం వాటిల్లటమే కాక.. ఆహారాన్ని కూడా తినలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

అధ్వాన్నంగా ఉన్న రహదారులు
అధ్వాన్నంగా ఉన్న రహదారులు

By

Published : Mar 12, 2023, 5:59 PM IST

Updated : Mar 12, 2023, 8:07 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ గొల్లపల్లి నుంచి మాదిగ బండకు వెళ్లే రహదారిలో సుమారు పది గ్రామాలు ఉన్నాయి. ఆ పది గ్రామాల ప్రజలు ప్రతి నిత్యం ఏదో ఒక అవసర రీత్యా ఈ రహదారి గుండా ప్రయాణం సాగిస్తుంటారు. గత మూడేళ్లుగా మాదిగ బండ దగ్గర ఉన్న క్వారీ నుంచి హెవీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తూ.. రహదారిని పూర్తిగా నాశనం చేశాయి. దీంతో ఇప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణం ఒక సాహస యాత్రగా మారింది. లారీల వెనుక వచ్చే దుమ్ము, ధూళిలో ప్రయాణం చేస్తూ 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గొల్లపల్లి నుంచి మాదిగ బండ వరకు సుమారు 5 కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఈ పరిసర ప్రాంత ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతెరువు కొనసాగిస్తున్నారు. అయితే హెవీ లోడ్ ట్రక్కుల వెనక నుంచి వచ్చే దుమ్ము, ధూళి పంట పొలాలపై చేరి తీవ్ర పంట నష్టం కలిగిస్తున్నాయి. దీనివల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమ భూములను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఏ పంట పండించినా దుమ్ము వల్ల దిగుబడి అంతంత మాత్రమే ఉండడంతో అప్పులు తీర్చలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రయోజనార్థం ఎగువ కల్లాడు గ్రామానికి చెందిన హరినాథ్ రెడ్డి అనే ఒక రైతు.. తన సొంత భూమిని గొల్లపల్లి-మాదిగ బండ రోడ్డు కోసం కొంతమేర ఉచితంగా ఇచ్చాడు. అయితే తనకే హెవీ ట్రక్కుల దుమ్ము వల్ల పంటలు పండక తీవ్రంగా నష్టపోయి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, మరో ఐదు రోజుల్లో నూతనంగా రోడ్డు పనులు ప్రారంభిస్తే దారి వదులుతానని, లేకపోతే నా భూములకు కంచె వేసుకుని రోడ్డు బ్లాక్ చేస్తానని హెచ్చరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్లో చాలా బిజీగా ఉన్నారని ఆ రైతు ప్రస్తావించాడు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజా సమస్యలు తీర్చటానికా.. లేకుంటే రియల్ ఎస్టేట్లు, భూ దందాలు, క్వారీలు నిర్వహించేందుకా అని తీవ్ర విమర్శలు చేశాడు.

ఈ రోడ్డు కోసం నా భూమిలో స్థలం ఇచ్చి, ఇప్పుడు మీ వల్ల చివరికి నేను వ్యవసాయం మానేసే పరిస్థితికి వచ్చానంటూ మండిపడ్డారు. స్కూలుకి వెళ్లే విద్యార్థులు సైతం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ రోడ్డులో ప్రయాణం చేస్తుంటారు. వాళ్లు కూడా దుమ్ము, ధూళి వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఆసుపత్రి పాలవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. క్వారీ ట్రక్కులపై ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఆనుకుని సుమారు 55 గృహాలు, రెండు స్కూళ్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు.. ఇళ్లలో అన్నం తినడానికి కూడా సాధ్యపడడం లేదని, సగం అన్నం, సగం దుమ్ముతో.. మేము తిండి తినలేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు, పలమనేరు శాసనసభ్యులు ప్రజల ఆరోగ్యాన్ని, రైతుల ఆవేదనను గుర్తించి నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని 10 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

"రోజుకి 250 మంది పిల్లలు స్కూల్​కి ఇదే రూట్​లో వెళ్లి వస్తారు. ఇక్కడ రోడ్లు అధ్వాన్నంగా ఉంటటం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డస్ట్ ఎలర్జీ వస్తే ఒక్క రోజుకి వేలల్లో హాస్పిటల్ ఖర్చు అవుతుంది. మేము ఎమ్మెల్యేకు ఓట్లు వేసి గెలిపించింది జనాలను ఇబ్బంది పెట్టేందుకు కాదు. జనాల కోసం ఆయన్ని మేము ఎమ్మెల్యేను చేశాము. మా ఏరియాలో ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు సరిగ్గా తెలీదు. ఈ రోడ్డు కోసం నేను నా సొంత భూమిని ఉచితంగా ఇచ్చాను. ఐదు రోజుల్లోగా రోడ్లు వేస్తే దారివదులుతాను. లేకుంటే నా భూమికి కంచె వేసుకుని రోడ్డు బ్లాక్ చేస్తాను." - హరినాథ్ రెడ్డి, రైతు

అధ్వాన్నంగా ఉన్న రహదారులు
Last Updated : Mar 12, 2023, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details