జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా.. ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు చనిపోయిన ఘటనపై.. తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆర్థిక సహాయం చేయాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అన్నారు.
మాటలకు అందని విషాదం: పవన్‌కల్యాణ్
జనసేన అభిమానుల మృతి పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘‘జనసైనికుల మరణం మాటలకు అందని విషాదం. రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతంతో మరణించారన్న వార్త ఎంతగానో కలచివేసింది. మాటలకు అందని విషాదం.. తల్లిదండ్రుల గర్భశోకం అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను.. ఆ తల్లిదండ్రులకు నేనే బిడ్డగా నిలుస్తాను. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రమాద ఘటనలో మరికొందరు జనసైనికులు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారికి సరైన వైద్య సేవలు అందేలా చూడాలి’’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శాంతిపురం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం అందించి క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి!