pathakalva villagers protest: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. చంద్రగిరి మండలం పాతకాలువ గ్రామానికి వరద సాయం అందించేందుకు వెళ్లిన తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. పేరూరు చెరువు వరద నీటిని తమ గ్రామం వైపు మళ్లించి.. గ్రామం నీట మునగడానికి కారణమయ్యారంటూ ఆయనపై గ్రామస్తులు మండిపడ్డారు.
రెండు రోజులుగా పేరూరు చెరువు నీటిని పాతకాలువకు మళ్లిస్తున్నారని.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వరద సహాయం అంటూ తమ గ్రామానికి వచ్చారని మోహిత్ రెడ్డిని ప్రశ్నించారు. మోహిత్ రెడ్డి గ్రామం వదిలి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.
మోహిత్ రెడ్డి క్షమాపణనూ తిరస్కరించిన మహిళలు..
వరద బాధితులు ప్రశ్నించడంతో.. ఒక్కసారిగా అవాక్కైన మోహిత్ రెడ్డి.. గ్రామ సచివాలయానికి వెళ్లి స్థానిక మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. న్యాయం చేయాలని రోడ్డెక్కితే తమను పోలీసులతో కొట్టించి, తప్పుడుకేసులు బనాయించడం ఎంతవరకు సబబని నిలదీశారు. పోలీసుల లాఠీ దెబ్బలతో గాయపడిన మహిళకు క్షమాపణ చెప్పడానికి మోహిత్ రెడ్డి ముందుకొచ్చినప్పటికీ.. గ్రామస్తులు అందుకు ఒప్పుకోలేదు.
మహిళలు ఎంతకీ వినకపోవడంతో.. చెవిరెడ్డి తమ్ముడు రఘునాథరెడ్డి, స్థానిక ఎం.ఆర్.పల్లి పోలీసులు సైతం నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ.. వారూ విఫలమయ్యారు. దీంతో చేసేది లేక వరద సాయం అందించకుండానే వెనుదిరిగి వెళ్లారు. గ్రామ వీఆర్ఓ సిబ్బంది వరద సహాయం అందించడానికి ప్రయత్నించినప్పటికీ వారిని కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి:
Chandrababu letter to CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు...చంద్రబాబు లేఖ