సంక్రాంతి పండగ అనగానే అందరి చూపు చిత్తూరు జిల్లా వైపు ఉంటుంది. అందుకు కారణం ఇక్కడ జరిగే పశువుల పండగ. సంక్రాంతి చివరిరోజు వేల సంఖ్యలో ఏ.రంగపేటకు ప్రజలు చేరుకుంటారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. గ్రామస్థులు పండగను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పండగను చూసేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఈ గ్రామానికి వస్తారు.
ప్రతి ఏటా జనవరి 15 నుంచి నెల చివరి వరకూ పశువుల పండుగ నిర్వహించడం చిత్తూరు జిల్లాలో తరతరాలుగా వస్తున్న ఆచారం. సంక్రాంతి పండగలో చివరి రోజు కనుమ పండగ. సంవత్సరం అంతా రైతులకు సహాయంగా ఉండే మూగజీవాలను ఆ కనుమ రోజున ఆరాధించడం ఇక్కడి ప్రజల సాంప్రదాయం. పండుగ ముందు రోజు నుంచే పశువులను సిద్ధం చేస్తారు. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను ఒక్కొక్కటిగా ఊరు మధ్యలో జనాలపైకి వదులుతారు. వాటిని నిలువరించి కొమ్ములకు కట్టిన చెక్క పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఇది చిత్తూరు జిల్లాలోని పశువుల పండగ తీరు.