Passengers are facing problems: సీఎం సభకు జనాన్ని తరలించడానికి వందల బస్సులు వినియోగించడంతో ప్రయాణికులు రవాణా కష్టాలు ఎదుర్కొన్నారు. రోజూ బస్సుతో కళకళలాడే చిత్తూరు బస్టాండ్ వెలవెలబోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి బయల్దేరిన భక్తులు బస్సుల్లేక బస్టాండ్‌లోనే పడిగాపులు కాశారు. వేరే ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులు,కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉసూరుమన్నారు. బస్టాండ్‌లో గంటల తరబడి వేచిచూశారు. ఎదురుచూడగాచూడగా వచ్చిన ఒకటీ అర బస్సులో సీట్ల కోసం జనం ఎగబడ్డారు. మరో బస్సు మళ్లీ ఎప్పటికి వస్తుందో అనే సందేహంతో వచ్చిన బస్సులో స్థలం కోసం ఎగబడ్డారు. కొంతమంది ఇరుక్కుని, కొంతమంది నిలబడే ప్రయాణం చేశారు. చాలా మంది బస్సులు లేక.. అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో వెళ్లారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా చిత్తూరు పట్ణణంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు సామాన్యులకు చిరాకు తెప్పించాయి. సీఎం కాన్వాయ్ వెళ్లని బస్టాండ్ వైపు కూడా ప్రజల వాహనాల్ని అనుమతించలేదు. తిరుపతి వైపు నుంచి చిత్తూరు పట్టణంలోకి వెళ్లే దారలు మూసేశారు. బస్టాండ్ నుంచి కలెక్టర్ బంగళా వరకూ రాకపోకలు నిలిపివేశారు. సీఎం పర్యనకు వెళ్ల బస్సులకు రైట్ రైట్ చెప్పిన పోలీసులు.. స్థానికుల వాహనాలను డైవర్ట్ చేశారు.
Cm Jagan Tour: బస్సుల లేక.. ట్రాఫిక్ డైవర్షన్‌తో సామాన్యులకు చుక్కలు! సీఎం పర్యటన కష్టాలు.. - నేటి తాజా వార్త
cm jagan Chittoor Tour: సీఎం జగన్ చిత్తురు పర్యటనలో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓవైపు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయగా... మరో వైపు సీఎం పర్యటన నేపథ్యంలో బస్సులను తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా బస్సులను తరలించారని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయ డైరీని అమూల్ కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
![Cm Jagan Tour: బస్సుల లేక.. ట్రాఫిక్ డైవర్షన్‌తో సామాన్యులకు చుక్కలు! సీఎం పర్యటన కష్టాలు.. Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-07-2023/1200-675-18912006-805-18912006-1688470061313.jpg)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపర్యటనలో... జిల్లా అధికారులు, అధికార పార్టీ నేతల అత్యుత్సాహంతో ప్రజలు నానాఅవస్ధలు పడ్డారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రోడ్డుకు అడ్డంగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేయడంతో ఎటు వెళ్ళలేని పరిస్ధితి నెలకొంది. నగరంలోని రిలయన్స్ మార్ట్ నుంచి డెయిరీ వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు. ముఖ్యమంత్రి సభకు జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు వినియోగించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. నగరంలోకి బస్సులను పోలీసులు అనుమతించకపోవడంతో చిత్తూరు బయటనే ప్రయాణికులు దిగి నడవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. నాలుగు కిలోమీటర్లకు ముందే మురకంబట్టు వద్ద బస్సులను దారి మళ్లించారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజలను పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు. చెన్నై, వేలూరు వైపు వేళ్ళే బస్సులు దారి మళ్లించారు.
ముఖ్యమంత్రి జగన్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. విజయ డైరీని అమూల్ కు అప్పగించడాన్ని తప్పుపట్టారు. సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నల్లని బ్యాడ్జీలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు రాజేష్, సీపీఐ నాయకులు నాగరాజు, గంగరాజులతో పాటు పలువురు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లాలోని గుడిపాల, పెనుమూరు, పూతలపట్టు, యాదమరి, బంగారుపాలెం, తవణంపల్లి మండలాల్లో ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.