పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరు ఆ పంచాయతీ వైపు దృష్టి మళ్లించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చెందిన ఆ పంచాయతీలో పట్టుకోసం ఒకరు.. పరువు కోసం మరొకరు పోటీలు పడుతున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీ ఆరంభం నుంచి తెదేపా మద్దతుదారుల చేతిలో ఉంది. కందులవారిపల్లి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచిగా దేశినేని వెంకట సుబ్రమణ్యంనాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆ తరువాత కందులవారిపల్లికి చెందిన కనుమూరి చంద్రబాబునాయుడు, నారావారిపల్లికి చెందిన ఎం.సావిత్రమ్మ ఏకగ్రీవంగా పదవులు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుగా బరిలో నిలిచిన పులివర్తి బెనర్జీ విజయం సాధించగా.. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ తెదేపా మద్దతుదారు పాశం చంద్రకుమార్ నాయుడు విజయం సాధించారు. ఇలా మూడు పర్యాయాలు ఏకగ్రీవం, రెండు మార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఆ పంచాయతీకి తెదేపా మద్దతుదార్లు మాత్రమే సర్పంచ్‌లుగా సేవలు అందించారు.
ఎలాగైనా చేజిక్కించుకోవాలని..
తెదేపాకు కంచుకోట అయిన కందులవారిపల్లి పంచాయతీలో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టారు. అందులో భాగంగా 650 ఓట్లతో అతి చిన్న పంచాయతీగా వున్న కందులవారిపల్లికి పక్కనున్న శేషాపురం, బి.కొంగరవారిపల్లి పంచాయతీలను కలిపి సుమారు 1460 ఓట్లతో ఎన్నికలు జరిగేలా చేశారు. అంతటితో ఆగక ఆ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఓసీ (మహిళ) రిజర్వేషన్‌ను కల్పించారు. వైకాపా మద్దతు దారుగా కమ్మ సామాజిక వర్గం నుంచే సర్పంచి స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.