ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల వేంకటేశునికి ప్రకృతిసిద్ధ నైవేద్యం.. - ttd latest news

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన బియ్యంతో నైవేద్యం తయారు చేసి సమర్పించనున్నారు. బ్రిటీషువారి పాలనకు ముందు ఉన్న.. ఈ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో నేటి నుంచి ఈ క్రతువు ప్రారంభం కానుంది.

prasadam in tirumala temple
ప్రకృతి సిద్ధంగా పండించిన పలు రకాల బియ్యం

By

Published : Apr 29, 2021, 7:17 AM IST

Updated : Apr 30, 2021, 12:09 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో సనాతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన బియ్యంతో నైవేద్యం తయారు చేసి స్వామి వారికి సమర్పించనున్నారు. నేటి నుంచి ప్రకృతి సిద్ధ నైవేద్య ప్రక్రియ మొదలుకానుంది. ఏడాదిలో రోజుకో రకం చొప్పున 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదించనున్నారు. బ్రిటీషువారి పాలనకు ముందు ఈ విధానం ఉండగా, కాలక్రమంలో స్వస్తి పలికారు. నిత్యం మూడు పూటలా స్వామివారికి 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ క్రతువు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో నేటి నుంచి ప్రారంభం కానుంది.

రోజుకొక ధాన్యంతో నైవేధ్యం..

కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్‌ సంస్థ నిర్వాహకుడు ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్‌ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ విషయంపై తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డితో ఆయన చర్చలు జరిపారు. నిన్న ఇక్కడి నుంచి 15 రకాల ప్రకృతిసిద్ధ బియ్యంతో వాహనం తిరుమలకు బయలుదేరింది. తొలుత 10 రోజులకు సరిపడా..2వేల 200కేజీల దేశీయ వరి వంగడాలతో పండిన బియ్యాన్ని తితిదేకు అందజేశారు. 365 రోజులకు సంబంధించి రోజుకు ఒక రకం చొప్పున ధాన్యాన్ని సరఫరా చేయనున్నట్లు విజయరామ్‌ తెలిపారు.

విత్తన ఉద్యమకారుల సహకారం
ప్రకృతి వ్యవసాయానికి ఆద్యుడు సుభాష్‌ పాలేకర్‌, దివంగత రాజీవ దీక్షిత, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుల స్ఫూర్తితో విజయరామ్‌ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందుకు దేశంలో ఉన్న ప్రకృతిసిద్ధ విత్తన ఉద్యమకారుల సహకారం తీసుకోనున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనుమపస్వామి నుంచి 30 నుంచి 40 రకాలు, ఒడిశాకు చెందిన సబర్మతి నుంచి 10 రకాల ప్రకృతి సిద్ధ బియ్యాన్ని సేకరించి అందించనున్నారు. నేటి నుంచి వారం రోజులపాటు తిరుమలలో ఉండి తితిదే ప్రధాన అధికారులకు ప్రకృతిసిద్ధ పంటలతో వంటలు చేసి భోజనం వడ్డించనున్నారు. ఇందుకు ఈ వంటల్లో నిష్ణాతులైన వారిని తిరుమలకు తీసుకెళుతున్నారు. స్వామివారికి నైవేద్యంతోపాటు లడ్డూ ప్రసాదం, ఉచిత అన్నదానాన్ని ప్రకృతి సిద్ధంగా భక్తులకు అందించాలని యోచిస్తున్నారు. లడ్డూ ప్రసాదానికి అవసరమైన సెనగలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దేశవాళి గోపాలన ద్వారా ఆవు పాలు, ఆవునెయ్యిని ప్రసాదాలు, క్రతువుల్లో వాడాలని నిర్ణయించారు.

15 రకాలు ఇవే...
తిరుమలకు 15 రకాల వరి బియ్యం పంపించారు. ఇందులో బహురూపి, నారాయణ కామిని, రత్నచోళి, కాలాబట్‌, చింతలూరు సన్నం, రాజ్‌బోగ్‌, రాజ్‌ముడి, చిట్టిముత్యాలు, బాస్‌బోగ్‌, తులసీబాసు, గోవింద్‌బోగ్‌, లాల్‌చోనా, ఎర్ర బంగారం, మాపిళ్లే, సాంబ రకాలు ఉన్నాయి. వీటిని వికారాబాద్‌, గూడూరు మండలం పినగూడూరులంక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పండించారు.

ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్ని చైతన్యపరించేందుకు ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయని తితిదే భావిస్తోంది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని.. ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు తోడ్పడుతుందని అభిప్రాయపడుతోంది.

తిరుమలేశునికి ప్రకృతిసిద్ధ నైవేద్యం

ఇదీ చదవండి:

కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి

Last Updated : Apr 30, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details