పుత్తూరు పరిసర ప్రాంతాల్లో రైతులు, గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్న ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జిల్లా తూర్పు విభాగం అటవీశాఖ అధికారి నరేష్థరన్ నేతృత్వంలో 'ఆపరేషన్ కొంకీ' పేరుతో కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం కుప్పం ప్రాంతంలోని ననియాల వద్ద శిక్షణ పొంది సంరక్షణలో ఉన్న జయంత్, వినాయక్ అనే ఏనుగులను లారీల్లో పుత్తూరు పరిధిలోని అమరం, కండిగ, నందిమంగళం గ్రామాల వద్దకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్లో భాగంగా.. ఒంటరి ఏనుగును దారి మళ్లించేందుకు బాణాసంచా పేల్చారు.
తిరుపతి జూపార్కు వైద్యులు అరుణ్, రోహిబ్ సింగ్, పర్యవేక్షణలో ఒంటరి ఏనుగును లొంగ తీసుకొవటానికి సుమారు మూడున్నర గంటల సేపు ఆపరేషన్ కొనసాగించారు. అయితే.. ఒంటరి ఏనుగు.. కుప్పం ఏనుగులకు లొంగినట్టే.. లొంగి తప్పించుకుంది. చీకటి పడటంతో ఆపరేషన్ను రేపటికి వాయిదా వేసుకున్నారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని ఆంక్షలు జారీ చేశారు. ఈ ఆపరేషన్లో చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, కార్వేటినగరం డివిజన్ పరిధిలోని.. అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది 100 మందికిపైగా పాల్గొన్నారు.