కరోనా విజృంభిస్తున్న వేళ శిక్షణకు అంతరాయం కలగకుండా ట్రైనీల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు కళ్యాణిడ్యామ్ పోలీసు ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అశోక్ బాబు తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణిడ్యామ్ పోలీసు ట్రైనింగ్ కాలేజ్‌లో.. ట్రైనీలకు నేటి నుంచి వర్చువల్ విధానంలో తరగతులు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. డీజీపీ గౌతం సవాంగ్, అదనపు డీజీపీ సంజయ్‌ల ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ సమన్వయంతో శిక్షణ తరగతులు మొదలు పెట్టామన్నారు.
వాటిని విజయవంతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతపురం, విజయనగరం, ఒంగోలులో శిక్షణ కేంద్రాలు ఉండగా.. కేవలం కళ్యాణిడ్యామ్ ట్రైనింగ్ సెంటర్లో మాత్రమే ఈ వర్చువల్ తరగతులను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. శిక్షణకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశ్యంతో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్న తీరు పట్ల శిక్షణ పొందేవారు, భోదనా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.