ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 నెలల పాటు శ్రీవారి ఆలయ మూసివేతకు.. ఏడాది పూర్తి!

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిట లాడే తిరుమల క్షేత్రం గత ఏడాది మార్చి నుంచి 3 నెలల పాటు నిర్మానుష్యమైంది. కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు 80 రోజులకు పైగా భక్తులు లేక వెలవెల బోయిన క్షేత్రంలో.. కొన్నాళ్లకు అన్‌లాక్​లో భాగంగా విడతల వారీగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తూ వచ్చారు. కరోనా వల్ల ఆలయాన్ని పూర్తిగా మూసివేసి నేటికి సంవత్సర కాలం పూర్తైనప్పటికీ... అనేక సేవలు శ్రీవారికి ఏకాంతంగానే కొనసాగాయి.

తిరుమలలో లాక్​డౌన్​ విధించి నేటికి ఏడాది
తిరుమలలో లాక్​డౌన్​ విధించి నేటికి ఏడాది

By

Published : Mar 20, 2021, 9:32 PM IST

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు తిరుమల పుణ్యక్షేత్రంపై.. కరోనా ప్రభావం పడింది. స్వామివారి ఆలయాన్ని సైతం మూసివేసేంతగా.. వైరస్ ప్రభావం కలిగించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఎన్నడూ లేనివిధంగా తిరుమల కొండకు వెళ్లే దారులు మూతపడ్డాయి. దాదాపు 80 రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కరువైంది. తర్వాత అన్ లాక్ లో భాగంగా.. భక్తులను కొద్దికొద్దిగా అనుమతిస్తూ వస్తున్నా.. స్వామివారికి నిర్వహించే సేవలు మాత్రం ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయం తీసుకున్నా... ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా.. తితిదే పాలకమండలి పునరాలోచనలో పడింది.

కరోనాతో పునరాలోచనలో అధికారులు

గత ఏడాది నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు అన్ని అర్జిత సేవలు... ఇతర వేడుకలు శ్రీవారి ఆలయానికే పరిమితమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించిన రథసప్తమిని తిరువీధుల్లో నిర్వహించినా... ఆర్జిత సేవలకు మాత్రం భక్తులను అనుమతించడంలేదు. ఉగాది నుంచి సేవలకు భక్తులను అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించినా.. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో పునరాలోచన చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి ముందు నిత్యం 70 నుంచి 80 వేలు... వారాంతాలు, పర్వదినాల్లో లక్షమంది వరకు స్వామివారిని దర్శించుకునే పరిస్థితుల నుంచి ప్రస్తుతం 45 నుంచి 50 వేల మందికి భక్తుల సంఖ్య పరిమితమైంది.

కరోనాతో తగ్గిన శ్రీవారి ఆదాయం

కరోనా ప్రభావంతో గతేడాది స్వామివారి ఆదాయం భారీగా తగ్గింది. దాదాపు 400 కోట్లు రూపాయలు తగ్గిపోయినట్లు తితిదే అంచనావేస్తోంది. హుండీ ఆదాయంతోపాటు, దర్శన టిక్కెట్లు, తలనీలాలు, ట్రస్టులు, అద్దె గదుల కేటాయింపు ఇలా అనేక రకాలుగా స్వామివారికి ఆదాయం వచ్చేది. దాదాపు 80 రోజుల పాటూ అన్నీ నిలిచిపోవడం... ఆ తరువాత పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్న కారణంగా.. భారీగా ఆదాయం తగ్గిపోయింది.

భక్తులకు పుష్కరణి స్నానాలు నిలిపివేత

కరోనా ప్రభావంతో శ్రీవారి పుష్కరిణి ఏడాదిగా మూతపడింది. గత ఏడాది మార్చి మొదటి వారంలో శ్రీవారి కోనేరును మూసివేశారు. అప్పటి నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈత కొలనులకు అనుమతించినప్పటికీ తితిదే మాత్రం నిబంధనలను సడలించడం లేదు. కైశిక ద్వాదశి, రథసప్తమి పర్వదినాలలో శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్లను పుష్కర స్నానం చేయించినప్పటికీ... భక్తలను మాత్రం అనుమతివ్వలేదు. తిరుమలలో ప్రముఖ తీర్థమైన పాపవినాశనంలో కూడా అధికారులు నీటిని నిలిపేశారు. ఇన్ని మార్పులు చోటు చేసుకుంటున్నా.. భక్తులు మాత్రం శ్రీవారి దర్శనానికి ఆరాటపడుతూనే ఉన్నారు. త్వరగా.. సాధారణ పరిస్థితి నెలకొనాలని, కరోనా ప్రభావం తొలగాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

తిరుపతి శ్రీవేంకటేశ్వర వర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details