ఫిబ్రవరి 1వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనున్న ఇంటింటికి రేషన్ పథకంలో భాగంగా బియ్యం సరఫరా చేసేందుకు వాహనాలు అన్ని హంగులతో ముస్తాబై ముందస్తుగానే మండల కేంద్రాలకు చేరుకున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో సంబంధిత అధికారులు ప్రభుత్వ పథకాల చిత్రాలను కప్పి ఉంచాల్సి ఉంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల కార్యాలయాలు ఒకే చోట ఉన్న క్రమంలో పథకం ప్రారంభం కోసం మండలానికి తెచ్చిన వాహనాన్ని పోలీస్ స్టేషన్ వద్ద నిలిపిఉంచారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, మద్దతుదారులు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న వాహనాన్ని చూసి చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. అధికారులు రక్షణ కోసం వాహనాన్ని పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారని, వాటిపై ఉన్న చిత్రాలను కప్పి ఉంచాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.