Obstacles to National Highway Expansion: నిత్యం రద్దీగా ఉండే నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వీటిని అరికట్టేందుకు.. జాతీయ రహదారుల సంస్థ.. రహదారి విస్తరణ పనులు చేపట్టింది. చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు 6 వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
చిత్తూరు-నాయుడుపేట మధ్య ఉన్న ఈ రహదారిని 2 భాగాలుగా విభజించి విస్తరణ పనులు చేపట్టారు. చిత్తూరు నుంచి మల్లవరం వరకు ఒక భాగం, రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు రెండో భాగంగా విభజించారు. చిత్తూరు-మల్లవరం మధ్య రహదారిని 6 వరుసలకు విస్తరిస్తూ చేపట్టిన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. రెండో భాగమైన రేణిగుంట-నాయుడుపేట మధ్య రహదారి విస్తరణకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఏర్పేడు, పెళ్లకూరు ప్రాంతాల్లో భూసేకరణలో సమస్యలు తలెత్తడంతో పనులకు అవాంతరాలు ఏర్పడ్డాయి. 2002లోనే భూసేకరణ పూర్తై... పరిహారం కూడా చెల్లించారు. ఇప్పుడు కొత్తగా మరోచోట భూసేకరణకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు సొంత ప్రయోజనాల కోసమే తమ భూములపై పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు.