New districts in AP:కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణ ముగిసినందున ప్రభుత్వ స్పందన ఎలా ఉండనుందనే ఉత్కంఠ నెలకొంది. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లు, సరిహద్దుల్లో మార్పులు తదితర అంశాలకు సంబంధించి ప్రజలతోపాటు ప్రజాసంఘాలు, పార్టీల నేతలు అభిప్రాయాలను కలెక్టర్ల ద్వారా సర్కారు దృష్టికి తెచ్చారు. మూడు రోజుల కిందట సీఎం వద్ద జరిగిన సమావేశంలో వీటన్నింటిపై ప్రాథమికంగా చర్చించారు. అభ్యంతరాలు, సూచనల్లో ముఖ్యమైనవి ఏమిటి?.. వాటి ఆమోదంపై ఏం చేద్దామని... అధికారులతో మాట్లాడారు. జిల్లాస్థాయి నుంచి వివరాలందాక మరో సమావేశం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన మొదలయ్యేందుకు వీలుగా ఈ ప్రక్రియను ఈనెల మూడో వారంలోపే ముగించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమే అంతిమం కానుంది.
5 విభాగాలుగా అభ్యర్థనలు స్వీకరణ...
అధికారులు ప్రజల నుంచి 5 విభాగాలుగా అభ్యర్థనలు స్వీకరించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం మార్పు, జిల్లా కేంద్రం మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ సరిహద్దుల మార్పు, జిల్లాల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ విభాగాల కింద మొత్తం 9 వేల 900 అభ్యర్థనలు వచ్చాయి. జిల్లాలవారీగా చూస్తే సగటున 5 చొప్పున ప్రధానమైన అంశాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒకటి రెండు రోజుల్లో ఇవన్నీ క్రోడీకరించే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు లేఖ
విజయనగరం జిల్లా నుంచి మొత్తం 1496 అభ్యంతరాలందాయి. వీటిలో అధిక భాగం సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలానికి సంబంధించినవే ఉన్నాయి. విభజనలో భాగంగా మన్యం జిల్లాలో కలిపిన ఈ మండలాన్ని విజయనగరంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలంటూ 4 వేల 764 మంది అభ్యర్థనలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు అక్కడి కలెక్టర్‌కు లేఖ రాశారు. కృష్ణా జిల్లాలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు పేర్ల మార్పు కోరుతూ అధిక సంఖ్యలో సూచనలందాయి. గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా పేరు మార్పు, రేపల్లె నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాలో కొనసాగించడం, సత్తెనపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాలపై ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి.
నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా..
జిల్లాల నోటిఫికేషన్ సమయంలో... ఒక నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశారు. అయితే కొత్త జిల్లా కేంద్రానికి తమ మండలం దూరమవుతుందని, ప్రస్తుత జిల్లాలోనే కొనసాగించాలని కొన్నిచోట్ల సూచనలందాయి. ఇలాంటి వాటిని ఆమోదిస్తే ఒక నియోజకవర్గం 2,3 జిల్లాల పరిధిలోకి వస్తుంది. గురువారం సీఎం జగన్ వద్ద జరిగిన తొలిదఫా సమావేశంలో ఇలాంటి అంశాలపై చర్చించారు. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. అభ్యంతరాలు, సూచనలకు సంబంధించి అధికారుల పరిశీలన పూర్తయ్యాక సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి:Botsa: ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స