ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోర్జరీ చేశారు.. పోటీ నుంచి తప్పించారు! - chittor municipal elections latest news

నామినేషన్లు వెనక్కు తీసుకోమని బెదిరింపులు తాళలేక వేరే ఊళ్లలో కొన్ని రోజులు తల దాచుకున్నారు. అక్కడికి వచ్చిమరీ ఒత్తిడి చేసినా భయపడలేదు. తీరా నామినేషన్ ఉపసంహరణ సమయం అయినా తర్వాత.. ఊరుకి వెళ్లి ఖంగుతిన్నారు. వారి డివిజన్లో ఏకగ్రీవమైందని తెలిసి షాక్​ అయ్యారు.

nomination with drawn incident without candidates at Chittoor
nomination with drawn incident without candidates at Chittoor

By

Published : Mar 5, 2021, 10:28 AM IST

నగర, పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు నుంచే చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష అభ్యర్థులకు ఎక్కడికక్కడ అడ్డంకులు మొదలయ్యాయి. ఎలాగోలా వీటన్నింటినీ దాటినప్పటికీ ఉపసంహరణ ప్రక్రియ సమయంలో అసలైన పరీక్ష ఎదురైంది. నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని కొందరు ఒత్తిళ్లు తేవడంతో తమను ప్రతిపాదించిన వారితో సహా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు తరలివెళ్లి తలదాచుకున్నామని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. చివరకు డివిజన్‌/వార్డు ఏకగ్రీవమైందని చెప్పడం తమను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఈ అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అంటున్నారు. ప్రధానంగా చిత్తూరు కార్పొరేషన్‌లో ఈ తరహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి, మదనపల్లెలో కొన్నిచోట్ల ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బుధవారం రాత్రి వచ్చా..


'పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు వస్తుండటంతో ఫిబ్రవరి 27న రాత్రి తమిళనాడుకు వెళ్లా. బుధవారం రాత్రి 8.30కు డివిజన్‌లో నన్ను బలపరిచిన వ్యక్తితో కలిసి చిత్తూరుకు వచ్చా. మా డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థి ఒకరు తప్ప అందరూ నామపత్రాలు ఉపసంహరించుకున్నారని తెలిసింది. కార్పొరేటర్‌గా బరిలో ఉండాలనే ఉద్దేశంతో కొద్ది రోజులపాటు నగరం వదిలి వెళ్లిన నేను నామినేషన్‌ ఎందుకు వెనక్కి తీసుకుంటా?' -బి.గోపి, చిత్తూరు 50వ డివిజన్‌ తెదేపా అభ్యర్థి

వేధింపులకు భయపడి వెళ్లా..

'నామినేషన్ల ఉపసంహరణకు వారం ముందు నుంచి కొందరు నాయకులు వేధిస్తున్నారు. భయపడి నగరం వదిలి పొరుగు రాష్ట్రం వెళ్లా. అక్కడికి కూడా కొందరు వచ్చి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. అక్కడి అపార్టుమెంట్‌లో నివసిస్తున్నవారు నాకు అండగా ఉండటంతో వెనుదిరిగారు. ఆ రోజు నుంచి బెంగళూరులోనే ఉన్నా. ఇంతలోపే నేను పోటీ చేస్తున్న డివిజన్‌ ఏకగ్రీవమైందని తెలిసింది. నేను, నా ప్రతిపాదకులు ఎవరూ ఆర్వో వద్దకు రాలేదు. నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు.' - ఎం.రాజానాయుడు, చిత్తూరు 12వ డివిజన్‌ తెదేపా అభ్యర్థి

ప్రైవేటు కేసు వేస్తా..

'వార్డు సభ్యురాలిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో నామినేషన్‌ వేసి ప్రచారం మొదలుపెట్టా. తీరా బుధవారం సాయంత్రం మా వార్డు ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు. నేను నామినేషన్‌ వెనక్కి తీసుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో అడిగితే మేం తీయలేదని సిబ్బంది అంటున్నారు. దీనిపై న్యాయస్థానంలో ప్రైవేటు కేసు వేస్తా.' - మీనాకుమారి, మదనపల్లె 9వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

'మార్చి 2, 3 తేదీల్లో నేను కర్ణాటకలో ఉన్నా. నన్ను బలపరిచిన వ్యక్తి తమిళనాడులో ఉన్నారు. మేం బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాం. ఇంతలోపే మా డివిజన్‌ ఏకగ్రీవమైందని అన్నారు. మా సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్లు వెనక్కు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.' - వెంకటేష్‌, చిత్తూరు 2వ డివిజన్‌ తెదేపా అభ్యర్థి

ఏకగ్రీవాలపై ఫిర్యాదు


చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన అభ్యర్థులు, వారి ప్రతిపాదిత వ్యక్తులు నగరంలో లేకపోయినా వారి నామపత్రాలు ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారని ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు చేసుకోవడంపై గురువారం ఆయన, అభ్యర్థులతో కలిసి నగరంలోని మూడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ అంశం తమ పరిధిలోకి రాదని.. నగరపాలక కమిషనర్‌కు పంపిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సందీప్‌.. జేసీ మార్కండేయులును కలిశారు. అక్రమ ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరారు. నగరపాలక కమిషనర్‌ విశ్వనాథ్‌కు, ఆన్‌లైన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: రూ.400 ఆదాయంతో ప్రారంభమై..నగర పాలక సంస్థ స్థాయికి చేరి..

ABOUT THE AUTHOR

...view details