చిత్తూరు జిల్లాలో 46 పంచాయతీలు 66 రెవెన్యూ గ్రామాలకు అతి పెద్ద మండలంగా శ్రీకాళహస్తి గుర్తింపు పొందింది. కొన్ని గ్రామాలు పట్టణంలో విలీనం కావడం, పునర్విభజన సక్రమంగా జరగలేదన్న కారణంగా పలు పంచాయతీల్లో ఎన్నికల నిలిచిపోయాయి. ప్రస్తుతం 35 పంచాయతీల్లో నిర్వహణకు నేతలు, ఓటర్లు, అధికారులు సిద్ధమవుతున్నారు. పట్టణానికి సమీపంలోని పంచాయతీలను శ్రీకాళహస్తి పురపాలికలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నారాయణపురం, టీఎంవీ కండ్రిగ, అరవ కొత్తూరు, ఊరందూరుతో పాటు ఉడుములపాడు పంచాయతీలోని దొమ్మరిపాలెం గ్రామాన్ని పట్టణంలో విలీనం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు ఆగిపోయాయి. అదేవిధంగా అధికార పార్టీకి అనుకూలంగా పలు గ్రామాలను విభజన, విలీనం చేయడంతో పాపనపల్లి, గోవిందరావుపల్లి, చల్లపాలెం, కలవగుంట, మన్నవరం, పోలి, ఎల్లం పాడు, యార్ల పూడి, రేపల్లె వైయస్సార్ బీసీ కాలనీ, వాంపల్లె గ్రామాల ప్రజలు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే తీర్పు వెలువడిన తర్వాతే ఈ పంచాయితీల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది .