ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుపాను నష్టం నుంచి ఇంకా తేరుకోని చిత్తూరు, కడప జిల్లాలు - చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు

నివర్‌ తుపాను మిగిల్చిన నష్టం నుంచి రాయలసీమ జిల్లాలు ఇంకా తేరుకోలేదు. ముఖ్యంగా చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తిగా నిండటమేగాక.. ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగటంతో.. లోతట్టు ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. పలుచోట్ల చెరువులు పూర్తిగా నిండి కట్టలు బలహీనంగా మారుతున్నాయి. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు.

niver effect in Chittoor district
niver effect in Chittoor district

By

Published : Nov 30, 2020, 7:55 AM IST

తుపాను నష్టం నుంచి ఇంకా తేరుకోని చిత్తూరు, కడప జిల్లాలు

నివర్‌ తుపాను ధాటికి కకావికలమైన చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విపత్తు బాధితుల కష్టాలు కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో నీటమునిగిన పంటలను చూసి రైతన్నలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామాలను అనుసంధానించే వంతెనలు, కల్వర్టులు తెగిపోయి ఇప్పటికీ చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ మిథున్‌రెడ్డి.. త్వరతగతిన వంతెనలు, కల్వర్టులకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పొలాల్లో పడిపోయిన పైర్లు, కోసిన పంటల నుంచి వచ్చిన మొలకలు.. రైతుకు కన్నీటిని మిగులుస్తున్నాయి. అన్నదాతలు.. నీళ్లలోంచి వడ్లను తోడుకుంటున్న దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి. పడమటి మండలాల్లోనే సుమారు 7 కోట్ల 32లక్షల రూపాయల వరకూ పంటనష్టం వాటిల్లిందని అధికారులు లెక్కగట్టారు.

సదుంలో పర్యటించిన .. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు.. రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వాగులు, కాలువల ఉద్ధృతికి.. సదుం, సోమల మండలాల్లో చాలా వరకూ వంతెనలు, కల్వర్టులు తెగిపోయి జనజీవనం స్తంభించింది. పార్టీ నేతలతో మాట్లాడిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ … జిల్లాలో పంట నష్టంపై ఆరా తీశారు. రామచంద్రాపురం మండలంలో రాయలచెరువులో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరగా.. చెరువు ఆధారితంగా ఉన్న పంటలన్నీ నీట మునిగాయి. చెరువు సమీప ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలన్నీ చెరువు నీటితో మునిగి దర్శనమిస్తూ.. తుఫాను తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న నీటితో పూర్తిగా నిండిన ప్రాజెక్టులకు సందర్శకుల తాకిడి ఎక్కువవుతోంది. ఎన్టీఆర్ జలాశయానికి సందర్శకుల తాకిడి ఎక్కువవుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని నీవా నదిలోకి విడిచిపెడుతున్నారు.

కడప జిల్లా సుండుపల్లి మండలంలో ప్రాజెక్టు ప్రాంతంలో.. అధికార, ప్రతిపక్ష నేతలు పర్యటించారు. కరవు ప్రాంతంలో వరుణుడు కరుణించినా... వర్షపునీటిని ప్రాజెక్టులో నిల్వ చేయలేకపోవటంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. తక్షణమే ప్రాజెక్టు కట్టకు మరమ్మతులు చేస్తామని, గేట్లను పటిష్ట పరిచే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. రాయచోటిలోని వెలిగల్లు ప్రాజెక్టులో నీటి పరిమాణం.. 4.46 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని.. పాపాగ్ని నదికి విడిచిపెడుతున్నారు. రైల్వేకోడూరులో వరద విధ్వంసానికి.. పేదలు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఇళ్లల్లోంచి ఇంకా పూర్తిగా నీరు వెళ్లకపోవటంతో.. వండుకునే పరిస్థితి లేని దాదాపు 400 కుటుంబాలకు.. తెలుగుదేశం నేతలు ఆహారపొట్లాలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్.. ఓబులవారిపల్లె మండలంలో రైతులను పరామర్శించారు. నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించారు.

అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో యల్లనూరు మండలం తిమ్మంపల్లి, శింగవరం గ్రామాల మధ్య రోడ్డు కోతకు గురైంది. రాకపోకలకు అంతరాయం కలగటంతో... తాడిపత్రి నుండి తిమ్మంపల్లి, శింగవరం మీదుగా పులివెందుల వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ , కనేకల్ మండలాల ప్రజలు... తుంగభద్ర జలాల ఉద్ధృతికి భయపడుతున్నారు. హెచ్​ఎల్​సీలో తుంగభద్ర జలాలు భారీ స్థాయిలో ప్రవహించటంతో … కాలువ గట్లు కోతకు గురవుతాయేమోనని లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి ఉద్ధృతికి కనేకల్ సమీపంలోని చిక్కనేశ్వర వడియార్ చెరువుకు రంధ్రం ఏర్పడటంతో.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న అధికారులు.. అక్కడకు చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గండి పూడ్చటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:సభాక్షేత్రంలోకి అస్త్రశస్త్రాలతో తెలుగుదేశం పార్టీ..!

ABOUT THE AUTHOR

...view details