అనుమతులు లేకుండా గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల కింద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారంటూ చిత్తూరు జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వాదనను పరిశీలించాక పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా నిర్ణయం తీసుకుంటామంది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై విచారణలో ఉన్న కేసులో ఇది భాగమైతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో కలిపి దీన్ని విచారణ చేపడతామంటూ 23వ తేదీకి వాయిదా వేసింది. గాలేరు-నగరి, హంద్రీనీవా పథకాల కింద ఎలాంటి పర్యావరణ అనుమతుల్లేకుండా చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివీడు, పుంగనూరు మండలం నేతిగుంటపల్లి, సోమల మండలం ఆవులపల్లి రిజర్వాయర్ల నిర్మాణాన్ని సవాలు చేస్తూ సోమల మండలానికి చెందిన జి.గుణశేఖర్ మరో 12 మంది రైతులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ కె.రామకృష్ణన్, డాక్టర్ కె.సత్యగోపాల్‌లతో కూడిన ఎన్జీటీ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.
రాయలసీమ ఎత్తిపోతలతో సంబంధం లేదు
పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వేసిన పిటిషన్‌తో దీనికి సంబంధం లేదన్నారు. ఇది రిజర్వాయర్ల విషయమని, రైతుల భూములకు సంబంధించినదని చెప్పారు. ఈ పథకాల కింద ఇప్పటికే 7 రిజర్వాయర్లు కట్టారని, మరో మూడు నిర్మించనున్నారని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏర్పాటైన జాయింట్ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. అది ప్రాజెక్టా, ఎత్తిపోతల పథకమా అన్నది తేలేదాకా ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పలేమని పేర్కొంది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, దొంతి మాధురిరెడ్డిలు వాదనలు వినిపిస్తూ దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుగుతోందని, ఈ దశలో వ్యక్తులు వచ్చి ఎలా పిటిషన్ వేస్తారన్నారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. తమ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని రైతుల తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం నిరాకరించింది.
- పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకోండి.. ఎన్జీటీలో ఏపీ రైతుల ఫిర్యాదు