చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో మృతదేహం ఖననం అడ్డగింత వ్యవహారంలో గ్రామస్థుల అనుమానమే నిజమైంది. మృతుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు మదనపల్లె వైద్యులు. ఇప్పటికే మదనపల్లె శివారు అటవీ ప్రాంతంలో లోతుగా గొయ్యి తవ్వి మృతదేహాన్ని అధికారులు ఖననం చేశారు. మృతుడికి కరోనా నిర్ధరణతో అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులు, అధికారులకు పరీక్షల నిర్వహణకు వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
చిత్తూరు: ఖననం అడ్డగింత వ్యవహారంలో మరో మలుపు - villagers stopped burial of the bodie news
చిత్తూరు జిల్లాలో మృతదేహం ఖననాన్ని అడ్డుకున్న వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన వైద్య సిబ్బంది... అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులు, అధికారులకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
ఇదీ జరిగింది...
మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీ వాసి(43) ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. వారం రోజులుగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతను ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో... వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని మండలంలోని వలసపల్లెలో ఖననం చేసేందుకు మృతుని బంధువులు ప్రయత్నించారు. అయితే అతను కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననం చేయడాన్ని పరిసర గ్రామస్థులు అడ్డుకున్నారు.
కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తేలితేనే ఇక్కడ ఖననం చేయాలని తేల్చిచెప్పారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు కొవిడ్ పరీక్షలు చేశారు. అనంతరం మదనపల్లె శివారు అటవీ ప్రాంతంలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని ఖననం చేశారు.