తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి నూతన పాలకమండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది(Sri Venkateswara Veterinary University news). పాలకమండలిలో ప్రజాప్రతినిధుల కోటాలో అనంతపురం ఎంపీ రంగయ్య, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి చోటు దక్కింది. అకడమిక్ కౌన్సిల్ విభాగంలో ప్రస్తుత తిరుపతి పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆదిలక్ష్మీ, కడప జిల్లా ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వైకుంఠరావు, తిరుపతి పశువైద్య కళాశాల పశు పరాన్నజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి.కొండయ్యను ఎంపిక చేశారు.
ప్రతిభావంత శాస్త్రవేత్తల కోటాలో విశ్వవిద్యాలయ మాజీ అధికారి డాక్టర్ ఎం.రంగనాథంకు పాలకమండలిలో చోటు దక్కింది. ఆదర్శ రైతుల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన నయనత, భీమవరంలోని శ్రీరామ చంద్ర అగ్రో ల్యాబ్ అధినేత కె.స్వాతి, జానకిరామ్‌లకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశువైద్య మండలి ప్రతినిధిగా కడప జిల్లా పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఔత్సాహిక పశువైద్య రంగ పారిశ్రామికుల కోటాలో కడప జిల్లాకు చెందిన విజయ్‌కుమార్, శ్రీజ పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రతినిధి విజయను ఎంపిక చేశారు. గత ప్రభుత్వం నియమించిన పాలకమండలి పదవీకాలం 2019 మే నాటికి పూర్తి అయింది.