NEW DISTRICTS AGITATIONS: మదనపల్లెని జిల్లా కేంద్రం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కౌన్సిల్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉదయాన్నే పోలీసులు కార్యాలయం చుట్టూ ఇనుప ముళ్లకంచెలు ఏర్పాటు చేసి లోనికి ఎవరినీ అనుమతించకుండా జాగ్రత్త తీసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, మదనపల్లె జిల్లా సాధన సమితి, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు..పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. కొందరు కార్యాలయం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనుకూలమైన అంశాలు ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో...
బాలాజీ జిల్లాకు నాయుడుపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ఏపీ యువజన విభాగం జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ధర్నా నిర్వహించారు. బాలాజీ జిల్లా కేంద్రంగా తిరుపతిని చేయడం అన్ని నియోజకవర్గాలకు దూరమన్నారు. తద్వారా ప్రజలు ఇబ్బంది పడతారని వెల్లడించారు. అన్నింటికి దగ్గరగ ఉన్న నాయుడుపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.