చిత్తూరు జిల్లాలోని కుప్పం బ్రాంచి కాలువ.. ప్రస్తుతం ఇది ప్రధాన చర్చగా మారింది.. కుప్పం ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ఈ కాలువ ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది.. చివరి దశ పనులు నిలిచిపోయాయి.. కేవలం మూడు కి.మీల పరిధిలో పనులు పూర్తి చేస్తే ఆశయం నెరవేరుతుంది.. ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం వల్ల పనులన్నీ నిలిచిపోయాయి. కాలువ పనులు పూర్తిచేయాలని కోరుతూ తెదేపా ఐదురోజుల కిందట పాదయాత్ర చేపట్టింది.. పోటీగా వైకాపా నేతలు యాత్రకు సిద్ధం కావడం.. పోలీసులు రెండు పార్టీల నేతలను అడ్డుకోవడం జరిగిపోయాయి.. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ప్రభుత్వంపైనా.. అధికారుల పైనా విమర్శలు గుప్పించారు.
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 110 చెరువులను నింపడంతో పాటు 6300 ఎకరాలకు సాగు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించేందుకు కుప్పం బ్రాంచి కాలువకు ప్రతిపాదన చేశారు. ఇందుకోసం 123.641 కి.మీల మేరకు కాలువ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తొలుత 2016లో టెండర్లు పిలిచి రూ.430.26 కోట్లకు పనులు అప్పగించారు.దక్కించుకున్న గుత్తేదారులు వెంటనే పనులు ప్రారంభించారు. ఆ తర్వాత మరో రూ.122.75 కోట్లకు అదనంగా విలువ పెంచి రూ.553.01 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఆటంకాలు అధిగమించి..
కుప్పం బ్రాంచి కాలువ నిర్మాణంలో భాగంగా.. తొలుత 70 మీటర్ల ఎత్తులో పిల్లర్లను ఏర్పాటు చేసి నీటిని తరలించాలని భావించారు. ఇందుకు ఆరు ప్రాంతాలను గుర్తించారు. అది సాధ్యం కాదని భావించి 14 కి.మీల మేరకు పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. గుడిపల్లె ప్రాంతంలో కాలువ మార్గంలో క్వారీ రాళ్లు అడ్డురాగా అక్కడ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. భూసేకరణ సమస్యలు ఏర్పడగా అధికారులు చర్యలు తీసుకుని పరిష్కరించారు.
ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తేనే..
కుప్పం బ్రాంచి కాలువలో మూడుచోట్ల ఎత్తిపోతల పనులు చేపట్టారు. పెద్దపంజాణి మండలంలోని పశుపత్తూరు వద్దనే ఎత్తిపోతల పనులు పూర్తి చేయడంతో.. పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె మండలాల్లో కాలువ ద్వారా హంద్రీ-నీవా జలాల ప్రవాహానికి మార్గం ఏర్పడింది. వి.కోట మండలంలోని క్రిష్ణాపురం వరకు నీటి రాకకు ఇబ్బంది లేదు. గత ఏడాది ట్రయల్‌రన్‌గా కృష్ణా జలాలు క్రిష్ణాపురం వరకు వచ్చాయి. అక్కడ ఎత్తిపోతల ముగింపు దశ పనులు ఆగిపోవడంతో నీరు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.