కేంద్రం రూపొందించిన నూతన విద్యావిధానం ద్వారా దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని... కేంద్ర సహాయమంత్రి లోకనాథన్ మురుగన్ అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏ రోడ్ మ్యాప్ టు రివ్యాంప్ ది ఇండియన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టం అంశంపై శ్రీ వేంకటేశ్వర, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా వివిధ సంస్థల సహకారంతో నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో... ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
భారత దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యావిధానం భారత సంస్కృతి, సంప్రదాయాలను పూర్తిగా దెబ్బతీశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సమూలమైన మార్పులతో రూపొందించిన నూతన జాతీయ విద్యావిధానం దేశ దిశ, దశను మారుస్తుందని అభిప్రాయపడ్డారు. నూతన విద్యావిధానం అమలుతో దేశం విశ్వగురువుగా అవతరిస్తుందని తెలిపారు. భారతదేశంలోని ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలంటే అన్ని రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులు పూర్తిగా అవగాహన చేసుకొనే పద్ధతిలో ఈ విద్యా విధానం రూపొందించారన్నారు.