ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువ‌త‌కు భ‌విత‌న‌వుతా.. అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తా: నారా లోకేశ్​ - Yuvagalam padayatra

Yuvagalam padayatra: యువగళం పేరిట 400రోజుల సుదీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబ సభ్యులు ఆశీర్వదించి పంపారు. లోకేశ్‌ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబ సభ్యులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులనంతరం కడప బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు లోకేశ్​ బహిరంగ లేఖ రాశారు. యువ‌త‌కు భ‌విత‌న‌వుతా, అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తానన్న లోకేశ్.. రైత‌న్నను రాజుగా చూసేవ‌ర‌కూ విశ్రమించ‌బోనని స్పష్టం చేశారు.

blessings by family members
blessings by family members

By

Published : Jan 25, 2023, 4:37 PM IST

Updated : Jan 25, 2023, 6:59 PM IST

యువ‌త‌కు భ‌విత‌న‌వుతా.. అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తా: నారా లోకేశ్​

Nara Lokesh Yuvagalam padayatra: యువగళం పేరిట 400 రోజుల సుదీర్ఘపాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబ సభ్యులు ఆశీర్వదించి పంపారు. ఎన్టీఆర్ ఘాట్‌కు బయలుదేరే ముందు భార్య, కుమారుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులతో లోకేశ్‌ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఏడాదికిపైగా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమైన లోకేశ్‌.. కుమారుడు దేవాన్ష్‌ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. భార్య నారాబ్రాహ్మణి బొట్టు పెట్టి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

లోకేశ్‌ వాహనం ఎక్కేటప్పుడు తల్లి భువనేశ్వరి వెంట నడవగా.. తండ్రి చంద్రబాబు ఆయనకు ఎదురొచ్చారు. అత్తామామ నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవిల ఆశీర్వాదంతో పాటు ఎన్టీఆర్‌ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నందమూరి, నారా కుటుంబసభ్యుల ఆత్మీయతల మధ్య లోకేశ్‌.. ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఆయన సమాధి వద్దకు వెళ్లారు. లోకేశ్‌ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబ సభ్యులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులనంతరం కడప బయలుదేరి వెళ్లారు.

రాష్ట్ర ప్రజలకు లేఖ: పాదయాత్రకు బయల్దేరే ముందు రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. స‌మాజ‌మ‌నే దేవాల‌యంలో కొలువైన ప్రజ‌ల‌ంటూ లేఖ ప్రారంభించిన ఆయన.... రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంద‌రిపై ఉందన్నారు. అన్నివ‌ర్గాల‌కు అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వం, అన్ని రంగాల‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఒక్కచాన్స్ ఇవ్వండ‌ని కాళ్లావేళ్లా ప‌డి 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. సీఎం అయ్యాక సాగిస్తున్న విధ్వంసాన్ని ప్రజలంతా చూస్తూనే ఉన్నారని గుర్తుచేశారు.

వైకాపా బాదుడే బాదుడు పాల‌న‌లో బాధితులు కానివారు లేరన్నారు. ప్రజ‌ల‌కు ర‌క్షణ క‌ల్పించి, శాంతిభ‌ద్రత‌ల‌ను కాపాడాల్సిన పోలీసు వ్యవ‌స్థను.. జ‌గ‌న్ త‌న ఫ్యాక్షన్ పాలిటిక్స్ న‌డిపించే ప్రైవేటు సైన్యంగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజ‌ల్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని అన్నారు. సైకో పాల‌న‌లో ఇబ్బందులు ప‌డుతున్న ప్రజల గొంతుక అవుతానని, అరాచ‌క స‌ర్కారుతో పోరాడ‌టానికి సార‌థిగా వ‌స్తున్నానని చెప్పారు.

యువ‌త‌కు భ‌విత‌న‌వుతా, అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తానన్న లోకేశ్.. రైత‌న్నను రాజుగా చూసేవ‌ర‌కూ విశ్రమించ‌బోనన్నారు. ఆడబిడ్డలకు సోద‌రుడిగా ర‌క్షణ అవుతానని, అవ్వా తాత‌ల‌కు మ‌న‌వ‌డినై బాగోగులు చూస్తానని లేఖలో తెలిపారు. ప్రజలే ఒక ద‌ళ‌మై, బ‌ల‌మై యువ‌గ‌ళం పాద‌యాత్రను న‌డిపించాలని కోరారు. మీ అంద‌రి కోసం వ‌స్తున్నా.. ఆశీర్వదించండి, ఆద‌రించండని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 25, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details