ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NARA LOKESH TOUR: జగన్‌.. కోతల ముఖ్యమంత్రి : నారా లోకేశ్ - tdp election campaign in Kuppam

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెదేపా పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. వైకాపాది కోతల ప్రభుత్వమని విమర్శించారు.

Nara Lokesh election campaign in Kuppam municipality
కుప్పం మున్సిపాలిటీలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం

By

Published : Nov 12, 2021, 12:23 PM IST

Updated : Nov 13, 2021, 5:14 AM IST

అందుకోసమే.. సైకిల్‌కు ఓటేయండి : నారా లోకేశ్

‘జగన్‌ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, రంజాన్‌ తోఫా, పెళ్లికానుక, అమ్మఒడి, పింఛను, చంద్రన్న బీమాల్లో కోత విధించింది. చివరికి అన్న క్యాంటీన్లు మూయించింది. అందుకే ఈ జగన్‌రెడ్డి.. కటింగ్‌ (కోతల) ముఖ్యమంత్రి! ఫ్యాను గుర్తుకు ఓటేసిన పాపానికి విద్యుత్తు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు సామాన్యులు ఫ్యాను వేయాలంటేనే భయపడుతున్నారు’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కుప్పం మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన వర్షంలోనూ రోడ్‌ షో నిర్వహించారు. లోకేశ్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘వైకాపా నాయకులకు పసుపు జెండా చూస్తుంటే వణుకు పుడుతోంది. అందుకే నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. విద్యార్థులపైనా ప్రతాపం చూపుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్‌ మా ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. అన్ని వస్తువుల ధరలు పెంచుకుంటూనే పోతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం చేస్తున్నదేంటి?’ అన్నారు. ‘కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయాలని వాలంటీర్లు బెదిరిస్తున్నారు. ఇడుపులపాయ రాజకీయమంటే భయపెట్టడం, బెదిరించడం. జగన్‌ రైతు రాజ్యం తెస్తానన్నారు.. ఇప్పుడు రైతుల్లేని రాజ్యం చేశారు. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని వ్యక్తి అన్నదాతల మెడకు మోటార్లు బిగిస్తున్నారు’ అని లోకేశ్‌ విమర్శించారు.

లక్ష్మీపురంలో ఉద్రిక్తత

నారా లోకేశ్‌ లక్ష్మీపురంలో రోడ్‌ షో నిర్వహిస్తుండగా వైకాపా ప్రచారరథం అటుగా వచ్చింది. అధికార పార్టీ కార్యకర్తలు కొందరు ఆ పార్టీ జెండాలు ఊపుతూ.. ఈలలు వేశారు. దీనిపై తెదేపా శ్రేణులు ప్రతిస్పందించడంతో స్వల్పంగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను అదుపు చేశారు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చని.. అప్రమత్తంగా ఉండాలని తెదేపా నేతలకు లోకేశ్‌ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన సమీక్షించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వ్యూహాన్నే ఇక్కడ అమలుచేసేందుకు అధికార పార్టీ నేతలు యత్నిస్తున్నారని, ఏజెంట్లతో పాటు కార్యకర్తలూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, ఉద్యోగులు: తెదేపా ఫిర్యాదు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షానికి చెందిన నాయకుల ప్రభావంతో కొందరు ఉద్యోగులు, వాలంటీర్లు, రేషన్‌ డీలర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని తెదేపా నాయకులు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి, చిత్తూరు జిల్లా కుప్పం పురపాలికలు, నెల్లూరు కార్పొరేషన్‌ల పరిధిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని కొందరు రేషన్‌ డీలర్లు, వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా రాజంపేట, కమలాపురాల్లో ఏపీ ఎన్‌జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించాలని ఉద్యోగులను కోరడంపై ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:LIVE VIDEO : కాసేపైతే జలసమాధే.. వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు!

Last Updated : Nov 13, 2021, 5:14 AM IST

ABOUT THE AUTHOR

...view details