LOKESH YUVAGALAM : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 14వ రోజు పాదయాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 14 కిలోమీటర్లు సాగింది. ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి మూర్తినాయకనపల్లి, కడపగుంట, మహదేవ మంగళం, సంసిరెడ్డిపల్లె, అవలకొండ, రంగాపురం కూడలి నుంచి రేణుకాపురం విడిది కేంద్రం వరకు లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న లోకేశ్ కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేశ్ కు తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రభుత్వం వేధిస్తోందంటూ...పాదయాత్రలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు లోకేశ్‌ను కలిశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్ధరణ 10 ఏళ్లకు ఒకసారి జరిగేదని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేయాలన్న నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేశ్ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని లోకేశ్ ఆరోపించారు. జే-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను వేధింపులకు గురి చేస్తోందని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
సామాన్యుడిపై జులుం.. మైక్ లాక్కొని...జీడీ నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకోగానే ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ప్రయత్నించిన లోకేశ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోకేశ్‌కు మైక్ అందించేందుకు వస్తున్న బాషాపై పోలీసులు దాడి చేసి గాయపరిచి మైక్ లాక్కున్నారు. లోకేశ్ నిలుచున్న స్టూల్ సైతం లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, తెదేపా నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్టూల్ మీదే నిలబడి లోకేశ్ నిరసన తెలిపారు. తమ గ్రామం వచ్చినప్పుడు మాట్లాడవద్దు.. అనడానికి పోలీసులకు ఏమి హక్కు ఉందంటూ జనం తిరగబడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు హరించడానికి మీరు ఎవరు అంటూ పోలీసుల్ని లోకేశ్ నిలదీశారు.
పాదయాత్రలో భాగంగా రంగాపురం కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. పరదాలు అడ్డుపెట్టుకునే జగన్... నా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.