Nadu-Nedu Scheme Works Are Pending : ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తామని నాడు చెప్పినా... నేడింకా పనులు పునాది దశలోనే మూలుగుతున్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు నెలల సమయం మాత్రమే ఉన్నా... కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. నిధుల కొరతతో పాఠశాలల ఆధునికీకరణ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు-నేడు పనుల పరిస్థితి.
ప్రచారమెక్కువ పని తక్కువ అన్న రీతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు- నేడు పనులు సాగుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని సర్కారు చేస్తున్న ప్రకటనలకు.... వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. నాడు-నేడు పథకంలో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల ఆధునికీకరణ పనులు నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆగిపోయాయి.
తరచూ సమీక్షలు నిర్వహించడం మినహా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండో విడతలో 2వేల 341 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. అదనపు తరగతి గదులు, కొత్త భవనాలు, ప్రహరీ గోడలు ఇలా వివిధ రకాల పనులు చేపట్టారు. నిధుల విడుదలలో జాప్యంతో రెండు నెలలుగా నిర్మాణాలు ఆగిపోయాయి.
నిధుల కొరత లేకుండా చూస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా.... రెండో విడత 'నాడు- నేడు' పనులు దాదాపు నిలిచిపోయాయి. చేసిన పనులకు ప్రభుత్వం నుంచి ఆలస్యంగా బిల్లులు రావడంతో పాటు సిమెంట్ కొరతతో నిర్మాణాలు మందగించాయి. కొత్త విద్యా సంవత్సరం నాటికైనా పనులు త్వరితగతిన పూర్తి చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇరుకు గదుల్లో, చెట్ల కింద ప్రస్తుతం ఇబ్బందులు పడుతూ పాఠాలు వింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.