గత నెల 24న చిత్తూరు జిల్లా ఎం.ఎన్ కండ్రిగలో దారుణ హత్యకు గురైన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు. భర్త గోపాల్ రెడ్డి, కుమారుడు నరసింహులే కిరాయి హంతకుల ద్వారా హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం ఆనంద్ అనే కిరాయి హంతకుడికి 30 వేలు ముట్టజెప్పినట్లు తెలిపారు.
అదే రోజు మరో నేరం !
తమిళనాడుకు చెందిన కిరాయి హంతకుడు ఆనంద్ డబ్బు తీసుకొని హత్యలు చేయటం ప్రవృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వృద్ధురాలు సరోజనమ్మను దారుణంగా హతమార్చాడన్నారు. . అదే రోజు గోవర్ధనగిరిలో సుభద్రమ్మ అనే మహిళపై దాడి చేసి నగలను దోచుకెళ్లాడని విచారణలో తేలింది.
హత్యలు చేయటమే వృత్తి
పోలీసులకు చిక్కిన ఆనంద్ హత్యలు చేయటాన్నే వృత్తిగా ఎంచుకొన్నాడని పోలీసు విచారణలో బహిర్గతమైంది. ఈ ఏడాది జులైలో తమిళనాడు అరక్కోణం తాలూకా కయికనూరులో నిర్మలమ్మ అనే మహిళను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2015లో మరో ఎనిమిదేళ్ల బాలుణ్ణి హతమార్చాడన్నారు.