వారం రోజుల్లో పెళ్లి... ఆ వేడుకను ఊహించుకుంటూ... కలల లోకంలో విహారిస్తూ ఆదమరచి నిదిరిస్తోంది ఆమె. కానీ ఇంతలోనే శరీరాన్ని దహించివేసే మంటలు అలుముకున్నాయి. వాటి తాకిడికి భయంకరమైన ఆర్తనాదాలు చేసింది. దీంతో అదిరిపడిన కుటుంబ సభ్యులు వెంటనే తేరుకొని మంటల్లో చిక్కుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లా గట్టుకిందపల్లిలో ఈ ఘటన జరిగింది.
'అయిన వారే హత్యాయత్నం చేశారు' - చిత్తూరు తాజా వార్తలు
కాళ్లపారాణితో కళ్యాణ మండపం ఎక్కాల్సిన ఆమె మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. అయిన వారే ఆమె పాలిట యమపాశాలుగా మారి నిర్ధాక్షిణ్యంగా పెట్రోల్ పోశారు. చివరికి అడ్డువచ్చిన మూగ జీవాలను కూడా వదలకుండా వాటి ఆయువు తీశారు.
ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అంతకు మునుపే తమ ఉనికి తెలుపుతాయన్న భయంతో కోళ్లు, కుక్కలకు ఆహారంలో గుళికలు మందు కలిపిపెట్టారు. ఈ విష ప్రయోగంతో 20కి పైగా కోళ్ళు, రెండు కుక్కలు మృతి చెందాయి. సమీప బంధువులు తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారని... అందుకు అంగీకరించక పోవటంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు.