చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతోపాటు మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చింది. గత సంవత్సరం మార్చిలో నామినేషన్ల ఉపసంహరణ రోజు కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి 2, 3 తేదీల్లో తిరిగి నామపత్రాల ఉపసంహరణకు అనుమతి ఇచ్చారు. 3వ తేదీ సాయంత్రం నాటికి రెండు నగర, అయిదు పురపాలికల్లో కలిపి 130 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతరం హైకోర్టు తీర్పుతో తిరుపతిలో మరో డివిజన్‌లో కూడా అధికార పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీలో నిలిచిన పరిస్థితి కనిపించింది. దీంతో ఏకగ్రీవాల సంఖ్య 131కు చేరింది.
వైకాపాకి మూడు పీఠాలు
ఆదివారం వెలువడే ఓటర్ల తీర్పుతో సంబంధం లేకుండా ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు అధికార వైకాపా ఖాతాలో పడ్డాయి. చిత్తూరులో 50 డివిజన్లకు 37, పలమనేరులో 26 వార్డులకు 18, పుంగనూరులో 31 స్థానాలనూ కైవసం చేసుకుంది. మరోవైపు చిత్తూరు, పలమనేరులో విపక్ష పార్టీల అభ్యర్థులు తాము అధికార పార్టీ ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొని.. బరిలో నిలిచామని చెబుతున్నారు. గట్టి పోటీ కూడా ఇచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా 22, మదనపల్లెలో 35 వార్డులకు 15 వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. తిరుపతిలో నాలుగు డివిజన్లు, మదనపల్లెలో మూడు వార్డులు అధికార పార్టీ గెలుచుకుంటే పుర పీఠాలు వైకాపా పరం కానున్నాయి. అయితే ఇక్కడ గట్టి పోటీని ఇచ్చామని, వైకాపాకు అంత తేలికగా అధికారం దక్కదని విపక్ష పార్టీలు అంటున్నాయి.