తిరుపతి నగరపాలిక, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించింది. గత ఏడాది మార్చిలో నగర, పురపోరు ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభం కానుంది. నాడు నామినేషన్ల కార్యక్రమం పూర్తి చేశారు. ప్రస్తుతం ఉపసంహరణ నుంచి ప్రారంభం కానుంది. జిల్లా పరిధిలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతోపాటు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాల విలీనంపై న్యాయస్థానంలో కేసులు నడుస్తుండటంతో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టారు. ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించడంతో తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చింది. కొత్తగా ఏర్పాటైన బి.కొత్తకోట నగర పంచాయతీకి, కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. గత మార్చిలో జరిగిన నామినేషన్ల సందర్భంగా వచ్చిన నామపత్రాలు వాటి వివరాలు ఇలా..
తిరుపతి, చిత్తూరులో..
తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా 333 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 39 తిరస్కరణకు గురికాగా 294కి ఆమోదం లభించింది. ఇక్కడ ఏ డివిజన్‌లోనూ ఒకే నామినేషన్ వచ్చిన దాఖలాలు లేవు. అన్నింటిలో ఒకటి కంటే ఎక్కువే దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇక్కడ ఏకగ్రీవాలు లేనట్లే. నామినేషన్ల దాఖలు సమయంలోనే కార్పొరేషన్ పరిధిలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలాచోట్ల విపక్షాలకు చెందిన వారి నామినేషన్లు అడ్డుకున్నారు.
* చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. అన్నింటికీ కలిపి 537 నామినేషన్లు వచ్చాయి. పరిశీలన సమయంలో 16 తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం 521 మంది బరిలో ఉన్నారు. అన్ని డివిజన్లకు నామినేషన్లు రావడంతో ఇప్పటి వరకు ఎక్కడా ఏకగీవ్రం కాలేదు. ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది.
పురపాలక సంఘాలు..
మదనపల్లె మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా 212 నామినేషన్లు వచ్చాయి. ఇందులో పరిశీలన సందర్భంగా 22 తిరస్కరణకు గురయ్యాయి. 190 ఆమోదం పొందాయి.
* పుంగనూరులో 31 వార్డులు ఉన్నాయి. వీటికి 96 నామినేషన్లు రాగా 21 అధికారులు తిరస్కరించారు. 17 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చింది. ఇవి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 14 వార్డులకు పోటీ జరగనుంది.
* పుత్తూరులో 27 వార్డులు ఉండగా 235 నామినేషన్లు వచ్చాయి. అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులు పోటీపడ్డారు. పరిశీలన సందర్భంగా 11 నామినేషన్లు తిరస్కరించారు. 224 నామినేషన్లకు ఆమోదం లభించింది.
* పలమనేరులో 26 వార్డులు ఉన్నాయి. 104 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 51 నామపత్రాలను తిరస్కరించడంతో 53కి ఆమోదం లభించింది. 10 వార్డులకు ఒక్కరే నామినేషన్ వేయడంతో అవి ఏకగ్రీవం కానున్నాయి. మిగిలిన 16 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులు పోటీపడుతున్నారు.
* నగరిలో 29 వార్డులకు 177 నామినేషన్లు వచ్చాయి. అన్నింటిలో ఎన్నికలు జరగనున్నాయి.