ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశవ్యాప్త పార్టీలన్నీ మోసగించాయని, చివరికి కోర్టులు కూడా ఒకరి పక్షాన నిలిచాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమీక్ష సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్గీకరణ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మినహా ఇతర నాయకులు ఎవరు మాదిగలకు మద్దతు తెలపలేదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తానంటూ ఎన్నికల సమయంలో మాటిచ్చి మోసగించాడని దుయ్యబట్టారు. కేసీఆర్ కూడా మాదిగల విషయంలో దారుణమైన మోసానికి ఒడిగట్టాడని మండిపడ్డారు.
పార్టీలు ఏళ్లగా మోసగిస్తున్నాయి..
జాతీయస్థాయిలో సుదీర్ఘ పరిపాలన చేసిన కాంగ్రెస్, భాజపాలు ఏళ్ల తరబడి మాదిగల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం వర్గీకరణ విషయంలో మద్దతు తెలిపే సూచనలు కనిపించడం లేదన్నారు.