చిత్తూరు జిల్లాలోని కుప్పం పురపాలిక పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలో ప్రలోభాల పర్వం సాగుతోంది. ఒక్కో నాయకుడికి ఒక్కో వార్డు బాధ్యతలను సంబంధిత పార్టీ అప్పగించింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ బాధ్యతలు స్థానికేతరులకు ఇచ్చింది. శనివారం ఉదయం నుంచే ఆ పార్టీ కార్యకర్తలు కొందరు సర్వేల పేరిట, ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడానికి ఇళ్లకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆరోపించారు. ఇప్పటికే కొంత (రూ.1500) పంపిణీ చేయగా.. ఎన్నిక రోజున కొంత ఎక్కువగా (రూ.2వేలు) ఇస్తున్నట్టు సమాచారం. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప శనివారం ప్రాథమిక పాఠశాలలో ప్రచారం చేశారు. అక్కడే ఓ మహిళా వాలంటీర్.. వైకాపా అభ్యర్థిని గెలిపించాలని కోరడం గమనార్హం. సోమవారం ఈ పాఠశాలలోనే పోలింగ్ నిర్వహించనున్నారు.
ఓటుతో సమాధానం చెప్పండి: చంద్రబాబు
‘హలో.. నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నా..’ అంటూ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు శనివారం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాటలు రికార్డు చేసిన స్వరం సందేశంగా వచ్చింది. కుప్పంలో అలజడి సృష్టించేందుకు బయటివారు వచ్చారని, వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. వైకాపా దుష్టశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పంతో ఉన్న బంధాన్ని వేరు చేయలేరని చెప్పారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. వైకాపా ప్రభుత్వం తనపై ఉన్న కోపాన్ని కుప్పంపై చూపుతోందన్నారు. రెండున్నరేళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు.