కాలేయ కాన్సర్ వంటి ప్రమాదమైన వ్యాధి రావడానికి కారణమైన హెపటైటిస్ బీ, సీ వైరస్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2030 నాటికి కాలేయ వ్యాధులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో... జాతీయ స్థాయిలో హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందుకు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. హెపటైటిస్ వైరస్ సోకిన వారిని గుర్తించి వారికి చికిత్స అందించడంతో పాటు... ఇతరులకు వ్యాప్తి చెందకుండా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రుల్లో... మోడల్ ట్రిట్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మోడల్ ట్రీట్మెంట్ కేంద్రంలో సేవలు ప్రారంభంమయ్యాయి. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా ఈ కేంద్రం ద్వారా సేవలు అందించనున్నారు. మంగళ, గురు వారాల్లో హెపటైటిస్ వైరస్ ప్రభావిత రోగులకు ఓపి నిర్వహిస్తున్నారు.
- హెపటైటిస్ అంటే ఏమిటి?
హెపటైటిస్-బి అనేది వైరస్. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయానికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. మన రాష్ట్రంలో 2 శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఇది ముదిరితే లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ప్రతి ఏడాది స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వంటి వైరస్లు సోకి అనారోగ్యం చెందే వారు అధిక సంఖ్యలో ఉంటారు. వీటితో పాటు హెపటైటిస్ బీ, సీ వైరస్ రోగులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. ప్రమాదకరమైన ఈ వ్యాధిని నిర్మూలించడానికి... కేంద్రం మోడల్ట్రిట్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది. హెపటైటిస్ వైరస్ సోకేందుకు అవకాశం ఉన్న వారిని పరీక్షించడంతో పాటు పాజిటివ్ వచ్చిన రోగులకు నయం చేసే లక్ష్యంతో కార్యక్రమం అమలవుతోంది.-డాక్టర్ భారతి, రుయా ఆసుపత్రి సూపరెండెంటెంట్, తిరుపతి.
నేషనల్ వైరల్ హెపటైటిస్ కార్యక్రమం కింద రోగులకు ఖరీదైన ఔషధాలు, వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా లభించనున్నాయి. ఈ హెపటైటిస్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు విస్తృత స్థాయిలో కాలేయ పరీక్షలను చేయనున్నారు. హెపటైటిస్ వైరస్ సోకిన రోగులను ప్రారంభ దశలో గుర్తించకపోవడం ద్వారా పరిస్థితి విషమించే ప్రాణాలకే ప్రమాదం ఉంది.