'ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసింది. దీనిపై తెదేపా రాజకీయం చేయటం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలందరూ గుమిగూడితే ఇబ్బంది అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసిందన్న విషయాన్ని తెదేపా గుర్తుంచుకోవాలి' ఇవి ఆదివారం పుత్తూరులో మీడియా సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ మంచి నిర్ణయం తీసుకుందని అక్కడ ఆమె సమర్థించారు. ఏమైందో ఏమో కొద్దిసేపటికే మరో వాదన వినిపించారు రోజా.
'చంద్రబాబు ఓటమి భయంతోనే ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకొని నాటకం ఆడుతున్నారు. 13 జిల్లాల్లో డిపాజిట్లు రావని ఓటమి భయంతో ఎన్నికలను వాయిదా వేయించారు. వైద్య, ఆరోగ్య శాఖను సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఎన్నికలను ఆరు వారాలపాటు అడ్డుకున్నారు. ప్రజల కోసం కాకుండా ఎన్నికల కమిషన్ చంద్రబాబు కోసం ఎన్నికలను వాయిదా వేసింది. రాబోయే ఎన్నికల ఫలితాల తరువాత తెదేపాను ఓఎల్ఎక్స్లో పెట్టుకోవాలి' అంటూ మరో వీడియోను విడుదల చేశారు రోజా.