ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమ్లా నాయక్‌ సినిమాపై రాజకీయాలు తగవు: వైకాపా ఎమ్మెల్యే రోజా - MLA Roja comments on Bheemla nayak

MLA Roja on Bheemla nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై రాజకీయాలు చేయొద్దని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. అఖండ, పుష్ప సినిమాలకు ఉన్న ధరలే భీమ్లా నాయక్‌కు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో టికెట్‌ ధర రూ.350 ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.150కే లభించడం సీఎం జగన్‌ చొరవతోనేనని పవన్‌కల్యాణ్‌ అభిమానులు గుర్తించాలన్నారు.

MLA Roja on Bheemla nayak
MLA Roja on Bheemla nayak

By

Published : Feb 28, 2022, 6:55 AM IST

Updated : Feb 28, 2022, 10:27 AM IST

MLA Roja on Bheemla nayak: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను తొక్కేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోదంటూ... భీమ్లా నాయక్‌ సినిమాపై రాజకీయాలు చేయొద్దని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. తెలంగాణలో టికెట్‌ ధర రూ.350 ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.150కే లభించడం సీఎం జగన్‌ చొరవతోనేనని పవన్‌కల్యాణ్‌ అభిమానులు గుర్తించాలన్నారు.

అఖండ, పుష్ప సినిమాలకు ఉన్న ధరలే భీమ్లా నాయక్‌కు ఉన్నాయని చెప్పారు. భీమ్లా నాయక్‌ సినిమా నష్టపోతుందంటే పవన్‌కల్యాణ్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ కాదనే విషయాన్ని ఫ్యాన్స్‌ గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్‌ వంటి వారు సీఎంను కలిసి సినీపరిశ్రమ సమస్యలు తీసుకెళ్లగా.. కమిటీ వేసి పరిష్కారానికి చర్యలు చేపట్టారని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ నగరిలో తన బ్యానర్లను సైతం చింపి గొడవలు చేయడం తగదన్నారు.

అధికారుల కనుసన్నల్లో థియేటర్లు...

ప్రభుత్వ తీరుపై పవన్‌కల్యాణ్‌ అభిమానులు భగ్గుమన్నారు. తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ అభిమానుల నిరసనల సెగ తగిలింది. ప్రస్తుత టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు శుక్రవారం మూసేశాయి. మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్లలో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. టికెట్‌ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లానాయక్‌ పోస్టర్‌పైనా తహసీల్దార్‌ ఫోన్‌ నంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు.

మంత్రులకు చేదు అనుభవం

తమ అభిమాన హీరోపై కక్షసాధిస్తూ, ఆయన సినిమా వేసే సినిమా హాలు ప్రారంభానికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ పవన్‌కల్యాణ్‌ అభిమానులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఎదుట నినాదాలు చేశారు. వీరు గుడివాడలో జీ3 సినిమా కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి శుక్రవారం వెళ్లినప్పుడు ఈ చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు అభిమానులను చెదరగొట్టి, కొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కొత్త సినిమా కాంప్లెక్స్‌లో భీమ్లానాయక్‌ చిత్రాన్ని మంత్రులిద్దరూ కొద్దిసేపు చూసి వెళ్లారు. తగ్గించిన టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని మైలవరంలో రెండు థియేటర్లను మూసేశారు. తిరువూరులోని నాలుగు థియేటర్లలో, నందిగామలోని మరో థియేటర్‌లో భీమ్లానాయక్‌కి బదులు వేరే చిత్రాలు ప్రదర్శించారు. ఉయ్యూరు, కైకలూరు, ముదినేపల్లెలో కొన్నిచోట్ల మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. ప్రత్యేక ప్రదర్శన వేయాలని విస్సన్నపేట-తిరువూరు రహదారిలో పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తగ్గించిన ధరలకు చిత్ర ప్రదర్శన సాధ్యం కాదని కైకలూరులో ఒక థియేటర్‌ను మూసివేస్తుండగా... పవన్‌ అభిమానులు అడ్డుకున్నారు. గన్నవరంలో రెండు, హనుమాన్‌జంక్షన్లో మరో థియేటర్లలో సాంకేతిక కారణాల పేరుతో శుక్రవారం నుంచి ప్రదర్శన నిలిపివేశారు. విజయవాడ శైలజ థియేటర్‌ వద్ద పవన్‌ అభిమానులు ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలోని కమలా థియేటర్‌లో అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినందుకు కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్‌ మాధవీలత థియేటర్‌ యాజమాన్యానికి రూ.50వేల జరిమానా విధించారు.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు

గుంటూరు జిల్లా కొల్లూరులో భీమ్లానాయక్‌ చిత్రాన్ని ప్రదర్శించడానికి థిÅయేటర్‌కి బీఫాం లేదని షోలు రద్దు చేయడంతో పవన్‌కల్యాణ్‌ అభిమానులు బస్టాండ్‌ సెంటర్‌లో బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్రాన్ని ప్రదర్శించాల్సిందేనని కొందరు అభిమానులు పెట్రోలు బాటిల్‌తో ఆందోళన చేపట్టారు. దీంతో వేమూరు-భట్టిప్రోలు మార్గంలో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఫిరంగిపురంలోని ఈశ్వరసాయి థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన (బెనిఫిట్‌ షో) వేస్తున్నట్లు ముందుగా టిక్కెట్లు అమ్మి, ప్రదర్శించకపోవడంతో అభిమానులు ఆందోళన చేపట్టారు. తగ్గించిన ధరలతో సినిమా ప్రదర్శించలేమని పెదనందిపాడులో ఒక థియేటర్‌ను యాజమాన్యం మూసివేసింది.
*చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలాజీ థియేటర్‌ వద్ద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకాలలో చిత్ర ప్రదర్శనలకు అధికారులు అడ్డంకులు సృష్టించడంతో రామకృష్ణా థియేటర్‌ ముందు పవన్‌కల్యాణ్‌ అభిమానులు ధర్నా చేసి సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. పుత్తూరులోని విష్ణుమహాల్‌, శాంతి థియేటర్‌లో కొద్దిసేపు ఆలస్యంగా చిత్రాన్ని ప్రదర్శించారు.

ఇదీ చదవండి:

బాక్సాఫీస్‌ వద్ద కక్ష సాధింపులు ఎందుకు..? ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

Last Updated : Feb 28, 2022, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details